Begin typing your search above and press return to search.

పార్టీని న‌డిపించిన వారు.. పార్టీలో పేరున్న‌వారు.. కాంగ్రెస్‌కు గొప్ప చిక్కే!

By:  Tupaki Desk   |   14 May 2023 10:32 AM GMT
పార్టీని న‌డిపించిన వారు.. పార్టీలో పేరున్న‌వారు.. కాంగ్రెస్‌కు గొప్ప చిక్కే!
X
క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నికల్లో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో 136 స్థానాలు ద‌క్కించుకుని.. బీజేపీకి బుద్ధి చెప్పామ‌న్న ఆనందం.. కాంగ్రెస్‌లో ఓవైపు క‌నిపిస్తున్నా.. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి పీఠంపై ముసురుకున్న వివాదం మంట‌లు రేపుతోంది. ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఈ ప‌ద‌విని ఆశిస్తున్నారు. వారే.. ఒక‌రు.. పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ కాగా, మ‌రొక‌రు మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌. అయితే.. ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఒక‌రు పార్టీని న‌డిపించి.. అధికారంలోకి తెచ్చేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేసిన డీకే శివ‌కుమార్‌.

మ‌రొక‌రు పార్టీలో డిగ్నిటీ ఆఫ్ మ్యాన్ పొజిష‌న్‌లో ఉన్న మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌. ఇద్ద‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌డం ఇప్పుడు కాంగ్రెస్‌కు క‌త్తిమీద సాము. మొత్తం 136 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 స్థానాల‌పై డీకే శివ‌కుమార్‌కు ప‌ట్టుంది. ఆ 100 స్థానాల్లోనూ ఆయ‌న ప‌ట్టుబట్టి నిద్రాహారాలు మాని మ‌రీ.. బీజేపీని మ‌ట్టి క‌రిపించేందుకు క‌ష్ట‌ప‌డ్డారు. అందుకే.. ఆయ‌న సీఎం సీటు కోసం.. ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక‌, క్లీన్ ఇమేజ్ స‌హా.. మేధావి వ‌ర్గంలోనూ మంచి పేరున్న సిద్దూ కూడా.. సీఎం రేసులో ఉన్నారు.

ఆయ‌న గ‌తంలో సీఎంగా ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌యాలు.. చేసిన ప‌నులు వంటివి తాజా ఎన్నిక‌ల్లో గ్రామీణ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌కు చేరువ చేశాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు డీకేకి సీఎం సీటు ఇవ్వాలా.. పెద్దాయ‌న సిద్దూను ఈ సీటులో కూర్చోబెట్టాలా? అనేది కాంగ్రెస్‌కు ప్ర‌ధాన ప‌రీక్ష‌గా మారిపోయింది. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నా ల మేర‌కు.. రెండున్న‌రేళ్ల చొప్పున సీఎం సీటును కేటాయించి ఇద్ద‌రికీ పంచే అవ‌కాశం ఉంద‌ని.. అంటున్నారు.

ఈ క్ర‌మంలో తొలుత సిద్ద‌రామ‌య్య‌కు అవ‌కాశం ఇచ్చి.. ఈయ‌న కేబినెట్‌లోనే డీకేకు.. వ‌క్క‌లిగ సామాజిక వ‌ర్గం త‌ర‌ఫున డిప్యూటీ సీఎం, రెవెన్యూ లేదా హోం శాఖ‌ల‌ను అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ న‌డుస్తోంది. త‌ర్వాత‌.. రెండున్న‌రేళ్లు అవే శాఖ‌ల‌ను సిద్ద‌రామ‌య్య‌కు ఇచ్చి .. డీకేను సీఎంను చేస్తార‌ని.. ఎన్నిక‌ల‌కు(2029) ముందు ఫైర్ బ్రాండ్ డీకే అయితే.. పార్టీ మ‌రోసారి గెలుపు గుర్రం ఎక్కుతుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.