Begin typing your search above and press return to search.

హిజాబ్ ఎపిసోడ్.. మనసును కష్టపెట్టే మాట అనేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   14 Feb 2022 12:42 PM GMT
హిజాబ్ ఎపిసోడ్.. మనసును కష్టపెట్టే మాట అనేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
X
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం అంతకంతకూ ముదురుతోంది. చూస్తుండగానే పలు రాష్ట్రాలకు పాకుతున్న ఈ ఇష్యూ.. తాజాగా కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య ఒకటి దారుణంగా మారింది. హిజాబ్ వేసుకోవటమా? లేదా? అన్నది ఎవరికి వారు తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పక తప్పదు.

ఎందుకంటే.. మన దేశానికి దగ్గర్లో ఉన్న అప్ఘాన్ మహిళలు మాకు హిజాబ్ వద్దు.. మమ్మల్ని దాని నుంచి విముక్తి చేయాలని ఆందోళనలు చేస్తుంటే.. అందుకు భిన్నంగా భారత్ లో మాత్రం హిజాబ్ మీద జరుగుతున్న పరిణామాలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనూ.. మత కోణంలో చూడటం.. పార్టీలు సైతం అదే తీరుతో వ్యవహరించటం పలు అంశాలు మరింత పీటముడి పడుతున్న పరిస్థితి. కర్ణాటక వ్యవహారాన్ని చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఒక కాలేజీ తీసుకున్న నిర్ణయం.. ఏకంగా దేశ సమస్యగా మార్చే ప్రయత్నం చూడటం.. భావోద్వేగాల్ని రగిలించటం లాంటివి దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న

. ఇక్కడే మరో అంశాన్ని చెప్పాలి. హిందూమతానికి సంబంధించి.. ఆచార వ్యవహారాల్లోని లోపాల్నిఎత్తి చూపుతూ మార్పుల కోసం సంస్కరణలు చేసినోళ్లు ఉన్నారు. అలాంటి పరిస్థితి ముస్లిం మైనార్టీల్లో ఎందుకు రాదన్న ప్రశ్న కొందరు సంధిస్తుంటారు. దానికి మత పెద్దలు కావొచ్చు.. ఆ మతానికి చెందిన చైతన్యవంతులు ఎందుకు గళం విప్పరు? అన్నది మరో ప్రశ్న.

ఇంకొక విషయం ఏమంటే.. ఎవరికి వారు తమ మతభావాల్ని వారి ప్రైవేటు జీవితాల్లో చూపించుకోవాలే తప్పించి.. బహిరంగంగా చూపిస్తామని చెప్పటం ఎంతవరకు సమంజసం? విద్యా సంస్థల్లో యూనిఫాం ఎందుకు? అన్న ప్రశ్నకు అందరూ చెప్పే సమాధానం.. అందరూ ఒకేలా చూడటం కోసమని.

అలాంటప్పుడు మతాన్ని గుర్తు చేసే హిజాబ్ ధారణ ఎంతవరకు సబబు? అన్న సందేహానికి సమాధానం చెప్పేవారు కనిపించరు. ఈ విషయాలు ఇలా ఉంటే.. హిజాబ్ ధారణకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ దారుణ వ్యాఖ్యలు చేశారు.

మహిళలు తమ ముఖానికి ముసుగు వేసుకోకపోవటం వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. లైంగిక దాడి కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పటం ద్వారా హిజాబ్ వివాదం మరో మలుపు తిరిగిందని చెప్పక తప్పదు. తాజాగా హిజాబ్ ఇష్యూ మీద మాట్లాడుతూ ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

''ఇస్లాంలో హిజాబ్ అంటే పర్దా... మహిళల అందాన్ని దాచిపెట్టేందుకు.. హిజాబ్ ధరించనప్పుడు మహిళలు అత్యాచారానికి గురవుతారు... అమ్మాయిలు పెద్దయ్యాక ముఖాన్ని హిజాబ్‌తో కప్పుకోవాలి లేదా అందాన్ని దాచుకోవడానికి పర్దా ధరించాలి.. ప్రపంచంలోనే అత్యధిక అత్యాచార కేసులు నమోదవుతున్న దేశం భారత్‌ అని మీరు చూస్తున్నారు.. కారణం ఏమిటి? అమ్మాయిలు తమ ముఖాలను కప్పి, అందాన్ని దాచుకోరు.. హిజాబ్ మహిళల భద్రత కోసం, వారి అందాన్ని దాచుకోవడం కోసం. హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు.. కానీ మహిళలను రక్షించడానికి ఇది చాలా సంవత్సరాలుగా ఆచరిస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు.

హిజాబ్ ధరించటం తప్పనిసరి కానప్పటికీ చాలా ఏళ్లుగా సాగుతున్న ఆచారమని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఈ ఇష్యూ మరింత విస్తరించటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలీ వివాదంలోకి వెళితే.. హిజాబ్ ధరించటం తమ హక్కు అని.. విద్యా సంస్థల్లో కూడా అనుమతించాలని కోరుతూ ముస్లిం యువతులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం.. వారి తరఫున వాదనలు వినిపించిన లాయర్ దేవాదత్కామత్ ను కొందరు టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. అనవసరమైన విషయాలపై ఎక్కువ చర్చ... దానికి మించిన రచ్చ జరుగుతుందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా..తాజా పరిణామాల్ని చూసినప్పుడు హిజాబ్ ఇష్యూ రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశమే ఎక్కువన్న మాట వినిపిస్తుండటం గమనార్హం.