Begin typing your search above and press return to search.

కన్నడ డీకే...టీ కాంగ్రెస్ కి లెసన్ అవుతున్నారా...?

By:  Tupaki Desk   |   20 May 2023 9:02 PM GMT
కన్నడ డీకే...టీ కాంగ్రెస్ కి లెసన్ అవుతున్నారా...?
X
డీకే శివ కుమార్. అర్ధ బలం అంగబలం కలిగిన నాయకుడు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని అయిదేళ్ళుగా కర్ణాటక లో విపక్షంలో ఉన్నా పోషించుకుని వచ్చిన నేత. బలమైన మోడీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన వారు. అన్నీ ఉన్నాయి అవకాశం కూడా వచ్చింది. కానీ చివరికి ఏమైంది, డిప్యూటీ సీఎం తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గా పార్టీని ముందుకు నడిపించినా చివరికి మాత్రం సిద్ధరామయ్యకు సీఎం సీటు అప్పగించి పక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు అంటే అదే కాంగ్రెస్ లో గొప్పతనం అని చెప్పాలి. కాంగ్రెస్ లో ఎక్కువ ఊహించుకున్నా లేక తామే మొనగాడు అనుకున్నా హై కమాండ్ ఆ లెక్కలను సరిచేస్తుంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో హై కమాండ్ దగ్గరే ఉంటుంది.

అంతే తప్ప సీఎం అని తమకు తాముగా అనుకున్నా చప్పట్లు కొట్టించుకున్నా ఏ మాత్రం సాగే వ్యవహారం కాదని తెలంగాణా కాంగ్రెస్ నేతలు మహ బాగా తెలిసి వచ్చింది అని అంటున్నారు. ఒక విధంగా కర్నాటక ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్ కి బూస్టింగ్ ని ఇస్తే అక్కడ సీఎం ఎంపిక జరిగిన తీరు బాగానే కళ్ళు తెరిపించింది అని అంటున్నారు

సీఎం ఎవరో పార్టీ గెలిచిన తరువాత ఢిల్లీ పంచాయతీలో తేలాల్సిన వ్యవహారం తప్ప గల్లీలలో అనుకుంటే సరిపోదు అన్న జ్ఞానం అయితే టీ కాంగ్రెస్ నేతలకు కన్నడ డీకే ఉదంతం తెలియచేసింది అని అంటున్నారు. డీకే లాంటి బిగ్ షాట్ కే సీఎం సీటు దక్కకపోతే ఇక ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఎన్నాళ్లు రేసులో ముందుడి పరుగులు తీసినా సుఖం లేదని టీ కాంగ్రెస్ నేతలు నిర్ధారణకు వచ్చారట.

అందువల్ల సీఎం సీటు విషయం హై కమాండ్ కి వదిలేసి పార్టీని ముందు గెలిపించే విషయంలో అంతా ఐక్యంగా సాగాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దాంతో డీకే అక్కడ పార్టీని అంతా ఒక్కటిగా చేసి ఎలా కష్టపడ్డారో ఇక్కడ తాము కూడా చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

ముందు పార్టీని గెలిపించుకుంటే మంత్రిగా అయినా చాన్స్ దక్కుతుందన్న స్పృహ అయితే నేతలలో వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే తొమ్మిదేళ్ళుగా అధికారం లేక అన్ని విధాలుగా ఆరిపోయిన నేతలకు ఈసారి గెలుపు చాలా ముఖ్యం అన్న ఆలోచన కూడా గట్టిగానే ఉందట. ఈసారి కనుక పార్టీ గెలవకపోతే కాంగ్రెస్ కి పోయేది ఏమీ లేదని తమకే అది తీరని ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు.

దాంతో సీనియర్ నాయకులంతా ఒక్క మాట మీద నిలబడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా నాయకుడు అంటే మల్లికార్జున ఖర్గే తప్ప తాను కాదని, ఆయన నాయకత్వంతో అంతా కలసి పనిచేద్దామని పిలుపు ఇస్తున్నారు. పార్టీలో అందరూ సమానమే అని కొత్త స్లోగన్ అందుకున్నారు.

ఇది కూడా డీకే నుంచి వచ్చిన స్పూర్తే అంటున్నారు. డీకే సైతం పెద్ద చిన్నా తేడా లేకుండా నాయకులను అందరినీ కలుపుకుని ముందుకు సాగారు. ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ లో అంతా ఒక్క త్రాటి మీదకు వస్తున్నారు. ముందు పార్టీ గెలవాలి. ఆ తరువాత సీఎం గా ఎవరిని అధినాయకత్వం నియమించినా ఓకే. సో ఒక విధంగా కాంగ్రెస్ ని మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు.