Begin typing your search above and press return to search.

మూడు రోజుల్లో ఆ ప్ర‌భుత్వం కూలిపోనుందా?

By:  Tupaki Desk   |   28 May 2019 5:13 AM GMT
మూడు రోజుల్లో ఆ ప్ర‌భుత్వం కూలిపోనుందా?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో కర్ణాట‌క రాష్ట్రంలో అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం అంత‌కంత‌కూ ముదురుతోంది. ఆ మ‌ధ్య‌న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నోటి వ‌ర‌కూ వ‌చ్చిన అధికారం.. చివ‌ర్లో జారిపోయిన‌ట్లుగా స్వ‌ల్ప అధిక్యంతో జేడీఎస్.. కాంగ్రెస్ పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే.

నాటి నుంచి క‌ర్ణాట‌క గ‌డ్డ‌పై బీజేపీ జెండా ఎగిరేందుకు ఆ పార్టీ నేత‌లు ప‌డుతున్న త‌ప‌న అంతా ఇంతా కాదు. జేడీఎస్.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాల్ని ఏదోలా ప్ర‌భావితం చేసి.. ప‌డ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చాలానే ప్ర‌య‌త్నాలు జ‌రిగినా.. ఫ‌లితం పాజిటివ్ గా రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వెలువ‌డిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కూటిపోవ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను బీజేపీ నేత‌లు అదే ప‌నిగా చెబుతున్నారు. అంతేకాదు.. తాము చెబుతున్న మాట‌లు ఎలా సాధ్య‌మో వారు చెప్పేస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ట‌చ్ లో ఉన్నారంటూ ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు య‌డ్యూర‌ప్ప చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కేంద్ర‌మంత్రి స‌దానంద గౌడ్ సైతం క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వానికి నూక‌లు చెల్లిన‌ట్లుగా వ్యాఖ్యాలు చేశారు. ఈ నేప‌థ్యంలో కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి కాలం చెల్లిన‌ట్లేన‌న్న ప్ర‌చారం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

బీజేపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై తాజాగా క‌ర్ణాట‌క‌ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు సిద్ద‌రామ‌య్య కొత్త స‌వాల్ విసిరారు. య‌డ్యూర‌ప్ప ప్ర‌క‌టించిన‌ట్లుగా జూన్ 1లోపు త‌మ ప్ర‌భుత్వం ప‌డిపోయిన ప‌క్షంలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. విప‌క్షం ప్ర‌క‌టించిన‌ట్లుగా జ‌రిగితే తన ప‌ద‌విని వ‌దులుకుంటాన‌న్న ధీమాను ఆయ‌న వ్య‌క్తం చేశారు. మ‌రి.. అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధం ఏ ట‌ర్న్ తీసుకోనుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఏమైనా రానున్న మూడు రోజులు క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయా? లేదంటే ఎప్ప‌టిలానే టీ క‌ప్పులో తుఫాను మాదిరి ప‌రిణామాలకే ప‌రిమిత‌మ‌వుతుందా? అన్న‌ది కాల‌మే డిసైడ్ చేయాలి.