Begin typing your search above and press return to search.

క‌న్న‌డ‌నాట హైడ్రామా!..మంత్రుల‌తో స‌హా రోడ్డెక్కిన సీఎం!

By:  Tupaki Desk   |   28 March 2019 1:49 PM GMT
క‌న్న‌డ‌నాట హైడ్రామా!..మంత్రుల‌తో స‌హా రోడ్డెక్కిన సీఎం!
X
హైడ్రామాల‌కు కేంద్ర బిందువుగా మారిన క‌ర్ణాట‌క‌లో మ‌రోమారు హైడ్రామా చోటుచేసుకుంది. నేటి మ‌ధ్యాహ్నం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో చోటుచేసుకున్న ఈ ఉదంతం... ఇప్ప‌టిదాకా అక్క‌డ చోటుచేసుకున్న హైడ్రామాల‌న్నింటికీ హైలెట్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... ఈ ఉదంతంలో క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామి స‌హా డిప్యూటీ సీఎం ప‌ర‌మేశ్వ‌ర‌ప్ప‌ - కేబినెట్ లోని దాదాపుగా అంద‌రు మంత్రులూ న‌డిరోడ్డుపై ధ‌ర్నాకు దిగారు. అస‌లే ఉండాకాలం... ఆపై నిప్పులు క‌క్కుతున్న భానుడి కింద సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నా... క‌ర్ణాట‌క కేబినెట్ బృందం ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. అయినా ఉన్న‌ప‌ళంగా సీఎం స‌హా మంత్రులంతా ఇలా ధ‌ర్నాకు దిగ‌డానికి పెద్ద కార‌ణ‌మే లేక‌పోలేదు. అదేమిటంటే... దేశ‌వ్యాప్తంగా ఇటీవ‌లి కాలంలో క‌ల‌క‌లం రేపుతున్న ఆదాయ‌ప‌న్నుశాఖ దాడులే. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ఆదేశాల‌క‌నుగుణంగానే ఐటీ దాడులు కొన‌సాగుతున్నాయ‌ని ఆరోపించిన కుమార‌స్వామి బృందం.... మోదీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా నినాదాల‌తో హోరెత్తించింది.

ఐటీ దాడుల విష‌యానికి వ‌స్తే... నేటి ఉదయం ఆదాయపు పన్నుశాఖ అధికారులు కర్ణాటకలోని కొన్ని కీలక ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎన్నికల బరిలో నిల్చున్న కాంగ్రెస్-జేడీఎస్‌ కూటమి అభ్యర్థులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు కొనసాగాయి. జేడీఎస్ కు చెందిన కొందరు కీలక నాయకుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. మండ్యలో జేడీఎస్ నాయకుడు - కర్ణాటక చిన్నతరహా నీటి పారుదల శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు సహా మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప నివాసాలపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బెంగళూరు సహా మండ్య, మైసూరు - హాసన్‌ జిల్లాల్లో ఒకేసారి 17 మంది కాంట్రాక్టర్లు - 7 మంది అధికారుల ఇళ్లల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలింగ్ కు సరిగ్గా నెలరోజుల వ్యవధి కూడా లేని ప్రస్తుత తరుణంలో హఠాత్తుగా చోటు చేసుకున్న ఐటీ దాడుల వ్యవహారం కాంగ్రెస్ - జేడీఎస్ నాయకుల్లో కలకలం రేపాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న ఆ రెండు పార్టీల నాయకులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలను అర్ధాంతరంగా ముగించుకుని రాజధానికి చేరుకున్నారు. సీఎం కుమారస్వామి.. బెంగళూరులో అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుమారు మూడుగంటల పాటు కొన‌సాగిన‌ ఈ భేటీలో ధర్నా చేపట్టాలని ఏక‌గ్రీవ నిర్ణ‌యం తీసుకున్నారు. అంతే ఉన్న‌ప‌ళంగా కేబినెట్ స‌మావేశ మందిరం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారంతా... నేరుగా ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని అక్క‌డే కార్యాల‌యం ముందు న‌డిరోడ్డుపై బైఠాయించారు. ఎండ వేడి తీవ్రంగా ఉన్నప్పటికీ.. వారు పట్టించుకోలేదు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం.. తమ పైకి ఐటీ దాడులు చేయిస్తోందంటూ ఆరోపించారు. వెంటనే ఈ దాడులను ఉపసంహరించుకోవాలని - అధికారులను వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమంత్రి నివాసంపై దాడులు చేసే అధికారం ఐటీ అధికారులకు లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా పరాజయం పాలు కావడం తథ్యమని వారు శాప‌నార్థాలు పెట్టారు. ఓటమి తప్పదనే భయంతోనే బీజేపీ నాయకులు ఆదాయపు పన్ను శాఖ అధికారులను అడ్డు పెట్టుకని భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని మ‌డిప‌డ్డారు. మొత్తంగా కేబినెట్ మంత్రుల‌తో పాటు సీఎం, డిప్యూటీ సీఎం కూడా రోడ్డెక్కి నిర‌స‌న తెల‌ప‌డంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.