Begin typing your search above and press return to search.

సీఎం మార్పు వ్య‌వ‌హారం వేళ‌.. ఆ ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   28 Aug 2022 7:50 AM GMT
సీఎం మార్పు వ్య‌వ‌హారం వేళ‌.. ఆ ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X
ద‌క్షిణ భార‌త‌దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం.. క‌ర్ణాట‌క‌. వ‌చ్చే ఏడాది మేలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఆ పార్టీ అధిష్టానానికి పెద్ద త‌ల‌పోటు తెస్తున్నాయ‌ని చెబుతున్నారు.

కాంగ్రెస్-జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి.. ఆ రెండు పార్టీల్లోని డ‌జ‌నుకుపైగా ఎమ్మెల్యేల‌ను బీజేపీలో చేర్చుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీ నాయ‌కులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌తో అధిష్టానానికి త‌ల‌నొప్పి త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు. అక్క‌డికి య‌డ్యూర‌ప్ప‌ను ముఖ్య‌మంత్రిగా తొల‌గించి ఆయ‌న సూచించిన లింగాయ‌త్ సామాజిక‌వ‌ర్గ నాయ‌కుడు బ‌స‌వ‌రాజ్ బొమ్మైకి సీఎం బాధ్య‌త‌లు అప్ప‌గించినా బీజేపీ ప‌రిస్థితి కుదుట‌ప‌డటం లేదు.

బ‌స‌వ‌రాజ్ బొమ్మై సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌ను మార్చాల్సిందేన‌ని బీజేపీ నేత‌ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు ఇటీవ‌ల మంత్రి ఒక‌రు చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్ని రేపాయి. తాము రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం లేద‌ని.. ఏదో అలా బండి లాగిస్తున్నాం అంతే అంటూ ఆయ‌న వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఈ నేపథ్యంలో తాజాగా క‌ర్ణాట‌క బీజేపీకి ఆది పురుషుడు లాంటి య‌డ్యూర‌ప్పను బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. బ‌స‌వ‌రాజ్ బొమ్మైను ముఖ్య‌మంత్రిగా త‌ప్పిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న తాజాగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తాను కీలు బొమ్మ సీఎంను కాద‌న్నారు. సీఎంను మార్పు చేస్తార‌న్న వార్త‌ల‌ను ఖండించారు. క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పు ఉండ‌ద‌ని తేల్చిచెప్పారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లు తన నేతృత్వంలోనే జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ మేర‌కు బెంగ‌ళూరులో మీడియాతో మాట్లాడిన ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై త‌న‌కు బీజేపీ హైకమాండ్‌ పూర్తి సహకారం ఇచ్చింద‌న్నారు. పరిపాలనలో ఏ సీనియర్‌ నాయకుల జోక్యం లేదని తెలిపారు. తాను ఎవరి చేతిలో కీలుబొమ్మను కాదని స్ప‌ష్టం చేశారు. మాజీ సీఎం యడియూరప్ప ప్రతిరోజు పరిపాలనలో మార్గదర్శక‌త్వం చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఆయ‌న నిత్యం ప‌రిపాల‌న‌లో వేలుపెడుతున్నార‌న్న వార్త‌లు అబ‌ద్ద‌మ‌న్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న హిందుత్వ, హత్య రాజ‌కీయాలు, అల్లర్లకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల విధానాలే కార‌ణ‌మ‌ని నిప్పులు చెరిగారు.