Begin typing your search above and press return to search.

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 20మంది మృతి

By:  Tupaki Desk   |   24 Nov 2018 10:18 AM GMT
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 20మంది మృతి
X
కర్నాటకలో మాటలకందని విషాదం నెలకొంది. ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 20 మందికి పైగా జల సమాధి అయ్యారు. శనివారం జరిగిన ఈఘటనతో వారి కుటుంబ సభ్యులు విషాద వదనంలో మునిగిపోయారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లా పాండవపుర నుంచి శనివారం మండ్య పట్టణానికి 30 మందికి పైగా ప్రయాణికులతో ప్రైవేటు బస్సు బయలు దేరింది. కనగరమరళి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపు తప్పింది. రోడ్డు కిందకు దిగి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.. 12 అడుగుల లోతులో నీరు ప్రవహిస్తుండడంతో బస్సు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా హాహాకారాలు ఆర్తనాదాలు చేశారు.

నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే 20 మంది మృత్యువాతపడ్డారు. ప్రమాదాన్ని చూసిన సమీప గ్రామాల ప్రజలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంలో బాధితులను బయటకు లాగారు. ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వెంటనే స్పందించారు. పోలీసు - రెవెన్యూ అధికారులతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీస్తున్నారు.

కాగా నది కాలువకు రక్షణగా ఎటువంటి రక్షణ గోడలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గతంలో కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని - అధికారులు స్పందించకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.