Begin typing your search above and press return to search.

య‌డ్డీకి నాడు డ‌బ్బుల వ‌ర్షం!..నేడు రాళ్ల వాన‌!

By:  Tupaki Desk   |   4 Nov 2017 12:33 PM GMT
య‌డ్డీకి నాడు డ‌బ్బుల వ‌ర్షం!..నేడు రాళ్ల వాన‌!
X
క‌ర్ణాట‌క రాజ‌కీయాలు ఇటీవ‌లి కాలంలో చాలా ఆస‌క్తిక‌రంగా మారిపోతున్నాయి. గ‌డచిన నాలుగైదేళ్లుగా ఆ రాష్ట్ర సీఎంగా కొన‌సాగుతున్నా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సిద్ద‌రామ‌య్య‌... మొన్న‌టిదాకా కాపాడుకుంటూ వ‌చ్చిన మిస్ట‌ర్ క్లీన్ ఇమేజీని డ్యామేజీ చేసేకున్నారు. ఓ ల‌గ్జ‌రీ వాచీ పుణ్య‌మా అని ఆయ‌న త‌న ఇమేజీని పోగొట్టుకోగా... ఆయ‌న‌పై విమర్శల దాడి చేసిన బీజేపీ కూడా పెద్ద‌గా ఏమీ లాభ‌ప‌డ‌లేద‌నే చెప్పాలి. అయినా ఇప్ప‌టిక‌ప్పుడు అక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగితే... కాంగ్రెస్ పార్టీని గ‌ద్దె దించేసి బీజేపీ అధికారం చేజిక్కించుకోవ‌డం అంత ఈజీ ఏమీ కాద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అంటే ద‌క్షిణాదిలో ప‌ట్టు బిగిద్దామ‌ని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ... ఇప్ప‌టికే త‌న‌కు గ‌ట్టి ప‌ట్టున్న క‌ర్ణాట‌క‌లో ఉన్న బేస్‌ను కూడా కోల్పోతోంద‌న్న మాట‌. మ‌రి ఉన్న ప‌ట్టే పోతుంటే... లేని రాష్ట్రాల్లో ప‌ట్టు సాదించ‌డం సాధ్య‌మేనా? ఏమో... ఏ రాష్ట్రంలో, ఎప్పుడు ఏ త‌ర‌హా ప‌రిస్థితులు ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం క‌దా.

మిగిలిన రాష్ట్రాల ప‌రిస్థితిని ప‌క్క‌న‌బెడితే... క‌న్న‌డ నాట బీజేపీ ఓ వెలుగు వెలిగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ క‌ర్ణాట‌క అధ్య‌క్షుడిగా ఉన్న బీఎస్ య‌డ్యూర‌ప్ప గ‌తంలో ఆ రాష్ట్ర సీఎంగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. య‌డ్డీ సీఎంగా ఉండ‌గా... అక్క‌డ బీజేపీ రాజ‌సం ఒల‌క‌బోసిన వైనాన్ని జ‌నం ఇంకా మ‌రిచిపోలేద‌నే చెప్పాలి. నాడు రాష్ట్ర ప‌రిస్థితులు బాగా లేవ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో కొంత సాయం చేయాల‌ని సీఎం హోదాలో య‌డ్డీ పిలుపునిచ్చిన ఉదంతం కూడా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే... నాడు కేవ‌లం కొన్ని గంట‌ల పాటు య‌డ్డీ జోలె ప‌ట్టి రోడ్డుపై న‌డిస్తేనే వంద‌ల కోట్ల మేర నిధులు పోగ‌య్యాయి. నాడు ఈ విష‌యం దేశవ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యింది. అంటే బీజేపీకి క‌న్న‌డ‌నాట మంచి ఫాలోయింగ్ ఉంద‌ని ఆ ఘ‌ట‌న చెప్ప‌క‌నే చెప్పేసింది. అయితే కాలం చాలా వేగంగా సాగుతోంద‌న్న విష‌యాన్ని కూడా ఇక్క‌డ మ‌రిచిపోరాదు. ఎందుకంటే... య‌డ్డీ ఇప్పుడు సీఎం కాదు. కేసులు చుట్టుముట్టిన ఓ మాజీ సీఎంగానే ఆయ‌న‌ను అక్క‌డి జ‌నం ప‌రిగ‌ణిస్తున్నారు. నాడు అడిగిన వెంట‌నే ముందూ వెనుకా చూడ‌కుండా నిధుల మూట‌ల‌ను జోలెలో పోసేసిన వారు కూడా ఇప్పుడు య‌డ్డీకి దూరంగానే మ‌స‌లుకుంటున్నారు.

అంతేకాదండోయ్‌... నాడు రోడ్డుపైకి వ‌చ్చిన య‌డ్డీకి నోట్ల క‌ట్ట‌లు స్వాగ‌తం ప‌ల‌క‌గా... నేడు ఆయ‌నపై రాళ్ల వ‌ర్షం కురిసింది. నిజ‌మా? అంటే నిజ‌మే. కర్ణాటకలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రలో శనివారం య‌డ్డీ వాహ‌నంపై రాళ్ల వ‌ర్షం కురిసింది. ఈ రాళ్లేసింది ఏ విప‌క్షానికి చెందిన నేత‌లో కాదు.. గ‌తంలో య‌డ్డీ జోలె ప‌డితే ఆయ‌న వెనుకాలే నడిచిన వారే ఇప్పుడు రాళ్లేశార‌ట‌. బీజేపీ అసమ్మతి కార్యకర్తలే య‌డ్డీ వాహ‌నంపై రాళ్లవర్షం కురిపించారట‌. ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చౌదరి నాగేశ్‌ మద్దతుదారులు యడ్యూరప్ప వాహనంపై రాళ్లదాడి చేశారు. ఈ దాడి నుంచి యడ్యూరప్ప తృటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో మళ్లీ అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రథయాత్రను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే కాస్తంత సీరియ‌స్ అయిన అమిత్ షా అస‌లు ఏం జ‌రిగిందో స‌మ‌గ్ర నివేదిక అంద‌జేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు ఆదేశాలు జారీ చేశారు.