Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రం దెబ్బకు రాజ్యాంగ సంక్షోభమేనా?

By:  Tupaki Desk   |   24 Sep 2016 6:06 AM GMT
ఆ రాష్ట్రం దెబ్బకు రాజ్యాంగ సంక్షోభమేనా?
X
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముందుగా ఊహించినట్లే కావేరీ జలాల ఇష్యూలో కర్ణాటక అసెంబ్లీ.. శాసన మండలి చేసిన ఏకగ్రీవ తీర్మానం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడుకు కావేరీ జలాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రత్యేకంగా చర్చించి.. ఉభయసభలూ తమిళనాడుకు నీళ్లను ఇవ్వకూడదంటూ తీర్మానం చేయటం చర్చనీయాంశంగా మారింది.

ఏదైనా వివాదం చోటు చేసుకుంటే అంతిమంగా తలుపు తట్టే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయమంటూ ఒక రాష్ట్రం తేల్చి చెప్పటం ఏమిటన్నది ఒక ప్రశ్న అయితే.. ఇదే జరిగితే.. రాజ్యాంగ సంక్షోభం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ.. శాసన మండలి చేసిన ఏకాభిప్రాయ తీర్మానంతో తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తేల్చేశారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కావేరీ జలాల్ని తాగునీటి కోసం తప్పించి ఇతర అవసరాలకు వాడకూడదన్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది.

ప్రస్తుతం కావేరీ నదీ పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలు అన్నింటిలో కలిపి 27.6టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వినియోగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తమిళనాడుకు విడుదల చేసే నీటి కారణంగా జరిగే పంట నష్టానికి నష్టపరిహారం ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఇదిలా ఉంటే.. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేసేందుకు నో అని ఒక రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం ద్వారా తేల్చి చెప్పిన వైనంపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మంచి చెడులు పరిశీలించి తీర్పు ఇవ్వటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత.. అందుకు అనుగుణంగా వ్యవస్థలోని విభాగాలు పని చేయాల్సి ఉంది. కానీ.. ప్రజల భావోద్వేగాల్ని చూపించి.. ఆదేశాల్ని అమలు చేయమని తేల్చి చెప్పటం ఒక ఎత్తు అయితే.. ఇదే విధానాన్ని రాబోయే రోజుల్లో మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తే ఏం చేయాలన్నది ఇంకో ప్రశ్నగా మారింది. మరీ.. సంక్షోభానికి ముగింపు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా చెప్పక తప్పదు.