Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ఆవరణలో ప్రమాణం చేస్తే సీఎం పదవికి గండమా!

By:  Tupaki Desk   |   26 July 2019 1:30 AM GMT
అసెంబ్లీ ఆవరణలో ప్రమాణం చేస్తే సీఎం పదవికి గండమా!
X
కర్ణాటకలోని విధానసౌధ ప్రమాణస్వీకారాలకు కలిసి రాలేదని చెప్పవచ్చు. అక్కడ ఎవరు ప్రమాణం చేసినా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న దాఖలాలు లేవు. జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సీఎంగా విధానసౌధ ముందు ప్రమాణస్వీకారం చేశారు. గత చరిత్ర చూస్తే విధానసౌధ ఆవరణలో ప్రమాణస్వీకారం చేసిన ఏ ముఖ్యమంత్రీ ఇంతవరకు ఐదేళ్లు పదవిలో లేరు. గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ సమక్షంలో నిర్వహించేవారు. కానీ 1993లో అప్పటి జనతాదళ్‌ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారిగా విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో ఏడాదిలోపే సీఎం పదవిని కోల్పోయారు. అదే ఏడాది హెగ్డే మరోసారి సీఎంగా ప్రమాణం చేసినా ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలతో మళ్లీ పదవిని పోగొట్టుకున్నారు.

1990లో సీఎంగా విధానసౌధ వద్ద ప్రమాణం చేసిన బంగారప్ప కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. కావేరీ జలాల విషయమై రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడంతో ఆయన రెండేళ్లలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2006లో బీజేపీ మద్దతుతో విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి కేవలం 20 నెలలే పరిపాలించగలిగారు. తాజాగా 2018 మే 23న విధానసౌధలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి 14 నెలలకే అధికారం కోల్పోయారు. కర్ణాటకలో 2008లో జరిగిన ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో విధానసౌధ ముందు అట్టహాసంగా, ఎంతో ఆడంబరంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి దూరమయ్యారు.

గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలకు అంత హంగు ఆర్భాటాలు ఉండేవి కావు. రాజ్‌భవన్‌ లో గవర్నర్‌ సమక్షంలో సాదాసీదాగా కార్యక్రమం నిర్వహించే వారు. అయితే 1983లో విధానసౌధలో ప్రమాణస్వీకారం చేసే ఆనవాయితీ మొదలుపెట్టారు. అప్పటి జనతాదళ్‌ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారిగా విధానసౌధలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఏడాది పూర్తి కాకముందే మద్యం కాంట్రాక్టులకు సంబంధించి ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు. అనంతరం అదే ఏడాది మరోసారి ఆయన కర్ణాటక సీఎం అయినప్పటికీ ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల నేపథ్యంలో పదవి కోల్పోయారు. 1990లో విధానసౌధలో ప్రమాణస్వీకారం చేసిన బంగారప్ప కూడా పూర్తి కాలం సీఎం పదవిలో కొనసాగలేదు. కావేరి జలవివాదం నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర అల్లర్లు రేకెత్తడంతో సమస్యను పరిష్కరించడంలో ఆయన విఫలమయ్యారు.

దీంతో రెండేళ్ల తర్వాత వీరప్ప మొయిలీ కాంగ్రెస్‌ తరఫున సీఎం అయ్యారు. ఆయన తర్వాత విధానసౌధలో ప్రమాణస్వీకారం చేసిన మరో వ్యక్తి ఎస్‌ఎం కృష్ణ. ముందస్తు ఎన్నికలు రావడంతో ఆయన కూడా పూర్తి కాలం సీఎంగా ఉండలేకపోయారు. తర్వాత 2004లో సీఎం అయిన కాంగ్రెస్‌ నేత ధరమ్‌ సింగ్‌ కూడా రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. జేడీఎస్‌ కుమారస్వామి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది. తర్వాత కుమారస్వామి బీజేపీ మద్దతుతో సీఎంగా విధానసౌధలో ప్రమాణస్వీకారం చేశారు. అయితే 20 నెలల అనంతరం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత యడ్యూరప్ప సీఎంగా వచ్చినా కుమారస్వామి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏడు రోజులకే రాజీనామా చేశారు. తాజాగా కుమారస్వామి 14 నెలలకే పదవి కోల్పోయారు.