Begin typing your search above and press return to search.

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు రేపే.. సీఎం రేసులో ఉంది వీరే!

By:  Tupaki Desk   |   12 May 2023 5:00 PM GMT
కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు రేపే.. సీఎం రేసులో ఉంది వీరే!
X
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 12కు పైగా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటించగా రెండు తప్ప మిగతా 10 కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా పలువురి పేర్లు తెరమీదకొస్తున్నాయి. వీరిలో ముందు వరుసలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉన్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య గతంలో ఐదేళ్లపాటు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరోమారు ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇక డీకే శివకుమార్‌ ఆర్థికంగా బలవంతుడైన నేత. కాంగ్రెస్‌ అధిష్టానం సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీల కు అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్‌ పార్టీకి .. కర్మ, కర్త, క్రియా శివకుమారే అంటే అతిశయోక్తి కాదు. గతంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్లలో దాదాపు 90 శాతం సిద్ధరామయ్య, శివకుమార్‌ సూచించిన వారికే దక్కాయి. మిగతా 10 శాతం కాంగ్రెస్‌ అధిష్టానం కేటాయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సిద్ధరామయ్య, శివకుమార్‌ సీఎం బాధ్యతలు చేపట్టడానికి ముందు వరుసలో ఉన్నారు.

మరోవైపు అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ది కూడా కర్ణాటకే కావడం గమనార్హం. కేంద్ర మంత్రిగా, లోక్‌ సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్‌ పార్టీ పక్ష నేతగా పనిచేసిన మల్లిఖార్జున ఖర్గే కు ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ఆయన 11సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే కు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందులోనూ ఆయన దళిత నేత. మల్లిఖార్జున ఖర్గే కు ఇవ్వకపోతే ఆయన కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేకు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రియాంక్‌ ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు.

సిద్ధరామయ్య, శివకుమార్, మల్లికార్జున ఖర్గేలు మాత్రమే కాకుండా రాహుల్‌ గాంధీకి సన్నిహితుడైన కేంద్ర మాజీ మంత్రి మునియప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. మునియప్ప, పరమేశ్వర ఇద్దరూ దళిత నేతలే కావడం గమనార్హం.

అలాగే కాంగ్రెస్‌ పార్టీలో సౌమ్యులుగా, నిజాయతీపరులుగా పేరున్న రామలింగా రెడ్డి, ఆర్‌వీ దేశపాండే పేర్లు కూడా సీఎం పదవికి వినిపిస్తున్నాయి.

రాహుల్‌ గాంధీకి సన్నిహితుడైన కృష్ణ బైరే గౌడ, దినేష్‌ గుండురావుల పేర్లు కూడా తెరమీదకొస్తున్నాయి. ఇక మహిళల్లో ఫైర్‌ బ్రాండుగా పేరున్న లక్ష్మీ హెబ్బాళ్కర్‌ పేరు కూడా వినిపిస్తోంది.

ఇలా పదుల సంఖ్యలోనే కర్ణాటక సీఎం పదవికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ పడుతున్నా సిద్ధరామయ్య లేదా శివకుమార్‌ ల్లో ఒకరు కాంగ్రెస్‌ సీఎం పదవిని చేపట్టే వీలుందని చర్చ జరుగుతోంది.