Begin typing your search above and press return to search.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మెగా టీవీ సంచలన సర్వే!

By:  Tupaki Desk   |   25 April 2023 1:19 PM GMT
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. మెగా టీవీ సంచలన సర్వే!
X
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తెర లేస్తోంది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో వరుసగా మరోసారి అధికారం చేపట్టడానికి బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతతో తామే గెలుస్తామని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. ఇంకోవైపు స్థానిక పార్టీ అయిన తమనే గెలిపిస్తారని జేడీఎస్‌ నమ్మకంతో ఉంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ చానెల్‌ మెగా టీవీ సంచలన సర్వే ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని మెగా టీవీ తన సర్వేలో వెల్లడించింది.

మెగా టీవీ సర్వే ప్రకారం.. 2018 ఎన్నికల్లో 80 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 92 నుంచి 102 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని మెగా సర్వే తెలిపింది. అయితే మెజారిటీకి కొద్ది సీట్ల దూరంలోనే నిలిచిపోతుందని ప్రకటించింది. కర్ణాటకలో ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు అవసరం.

ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 83 నుంచి 90 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందని మెగా టీవీ సర్వే తెలిపింది. ఈ సర్వేను బట్టి బీజేపీ అధికారానికి దూరమవుతుందని వెల్లడించింది.

ఇక స్థానిక పార్టీ అయిన జేడీఎస్‌ కు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు వచ్చాయి. ఈసారి జేడీఎస్‌ పార్టీకి 29 నుంచి 34 స్థానాలు వచ్చే అవకాశం ఉందని మెగా టీవీ సర్వే వెల్లడించింది. గతంలో కంటే కొన్ని సీట్లను జేడీఎస్‌ పార్టీ కోల్పోయే ప్రమాదముందని పేర్కొంది.

స్వతంత్రులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2 నుంచి 4 స్థానాల్లో విజయం సాధించొచ్చని సర్వే వెల్లడించింది. సర్వే ప్రకారం ఏ పార్టీకి అయినా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 113 సీట్లు వచ్చే అవకాశం లేదు. హంగ్‌ అసెంబ్లీ ఖాయమని మెగా సర్వే చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్‌ కీలకమవుతుంది. అయితే జేడీఎస్‌.. బీజేపీతో కలుస్తుందా? లేక కాంగ్రెస్‌ తో కలుస్తుందా అనేది తేలాల్సి ఉంది.