Begin typing your search above and press return to search.

క‌న్న‌డ పోలింగ్:నేనే సీఎం...కాదు నేనే

By:  Tupaki Desk   |   12 May 2018 10:13 AM GMT
క‌న్న‌డ పోలింగ్:నేనే సీఎం...కాదు నేనే
X
దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొన్న కర్ణాటక శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్‌, రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌మైన బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఆ రెండు పార్టీలు చ‌మ‌టోడుస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అనేక చిత్రాలు, ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

-బెంగళూరు నగర ఓటర్లను ఎంకరేజ్ చేసేందుకు - మొదటి సారి ఓటు వేసేవాళ్ల కోసం - యూత్ కోసం రెస్టారెంట్లు దోశె - కాఫీ లాంటివి ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాయి. మరికొందరు తమ హోటల్ ఐటమ్స్ పై డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారో.. వారు బెంగళూరు విధానసౌధ ఎదురుగా ఉన్న రెస్టారెంట్ కు వెళ్లి ఫ్రీగా దోశె - కాఫీ లాగించెయ్యవచ్చు. కొన్నేళ్లుగా ఓటు వేస్తూ.. ఈసారి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్న వారికి కూడా కాంప్లిమెంటరీ కింద కప్పు కాఫీ ఫ్రీ అందిస్తున్నట్లు హోటల్ నిసర్గ గ్రాండ్ ప్యూర్ ఓనర్ క్రిష్ణరాజ్ తెలిపారు.

- ఈ ఎన్నికల్లో యువత ఓటేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మడికెరిలోని పోలింగ్ బూత్ 131లో ఓ నవ వధువు పెళ్లి బట్టలతో వచ్చి ఓటేసింది. మొదటి ప్రాధాన్యత ఓటుకు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఓటేసిన తర్వాత పెళ్లి మండపానికి ఆ నవ వధువు వెళ్లింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళూరులో కూడా వియోలా ఫెర్నాండెస్ అనే నవ వధువు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి చేసుకునేందుకు బెల్తాన్‌ గడి ప్రాంతానికి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదైంది.

- కాగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఓటేశారు. చాముండేశ్వరీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దరామయ్య చాముండేశ్వరి - బాదామి నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పశిఖరిపురిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. బీజేపీకి భారీ విజయం ఖాయమన్న ఆయన.. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం మే 15న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని పేర్కొన్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురిని ఆహ్వానిస్తానని యడ్యూరప్ప తెలిపారు. 224 స్థానాలకు గానూ 145 నుంచి 150 స్థానాల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.

-క‌ర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని ఆ పార్టీ అధినేత - మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హసన్‌ జిల్లా హోలెనారసిపురలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో దేవెగౌడ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు తన సతీమణి చెన్నమ్మ దేవెగౌడ - కుమారుడు రేవన్న కుటుంబసభ్యులు కూడా ఓటు వేశారు.

- రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ట్విటర్ వేదికగా ఓటర్లకు ఓ స్వీట్‌ మెసేజ్‌ పెట్టారు. ఈ దేశ పౌరులుగా మీ హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు వచ్చిన కుంబ్లే.. తన కుటుంబ సభ్యులతో కలసి పోలింగ్ బూత్ ముందు లైన్‌ లో వేచి ఉన్న సెల్ఫీని ట్విటర్‌ లో పోస్ట్ చేశారు. ఆ సెల్ఫీతో పాటు ఓ మెసేజ్‌ ను కూడా పోస్టు చేశారు

- ఇక ఓటువేసిన ప్ర‌ముఖుల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత సదానంద గౌడ పుత్తూరులో - బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కోరమంగలాలో - మాజీ ప్రధాని దేవేగౌడ దంపతులు హసన్ జిల్లాలోని పోలింగ్ బూత్ నెం 244లో, మైసూర్ రాజు కృష్ణదత్త చామరాజ వడియార్ మైసూర్‌ లో - శ్రీశ్రీ రవిశంకర్ కనకపురాలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- మన దేశంలో థర్డ్‌ జెండర్‌ గా అధికార గుర్తింపు పొందినప్పటికీ.. వారిలో అతికొద్ది మందికే హిజ్రాలకే ఓటు హక్కుంది. ఇవాళ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో దాదాపు 28 వేల మంది హిజ్రాలుండగా వారిలో కేవలం 4552 మందే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. 2013లో 2100గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 4552కు చేరింది.

- ఇక.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 37 శాతం పోలింగ్ నమోదయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.