Begin typing your search above and press return to search.

ప‌క్క‌ రాష్ట్రంలో కొత్త‌ మతం..ఎన్నిక‌ల ముందు హాట్ చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   13 March 2018 4:44 PM GMT
ప‌క్క‌ రాష్ట్రంలో కొత్త‌ మతం..ఎన్నిక‌ల ముందు హాట్ చ‌ర్చ‌
X
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల వేడి కంటే ముందే...హాట్ హాట్ వార్త‌ల‌తో తెర‌మీద‌కు వ‌స్తోంది. రెండ్రోజుల కితం ప్ర‌త్యేక‌ జెండాతో తెర‌మీద‌కు వ‌చ్చిన ఆ రాష్ట్రం తాజాగా కొత్త మ‌తం పేరుతో మ‌ళ్లీ దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొంది. కర్ణాటకలో ఎన్నికలకు ముందు ఓ వాడివేడి చర్చ నడుస్తోంది. ఆ రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న లింగాయత్‌ లు తమకు ప్రత్యేక మతం లేదా మైనార్టీ హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తాము హిందువులం కాదని - హిందూ మతంలో కులాలుంటాయని - తమ మతంలో కులాలు ఉండవని వాళ్లు వాదిస్తున్నారు.

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటును ప్రభావితం చేసే శక్తి లింగాయత్‌ లకు ఉంది. దీంతో అక్కడ కాంగ్రెస్ - బీజేపీ అంశంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. సీఎం సిద్దరామయ్య ఇప్పటికే లింగాయత్‌లను ఓ ప్రత్యేక మతంగా గుర్తించడంతోపాటు మైనార్టీ హోదా కూడా ఇస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా మైనార్టీ హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. దీంతో ఆ రాష్ట్ర కేబినెట్ దీనిని ఆమోదించి - కేంద్రానికి పంపాలని భావిస్తున్నది. ఇక్కడ బీజేపీకి లింగాయత్‌ లు స్ట్రాంగ్ ఓట్ బేస్‌ గా ఉన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కూడా ఓ లింగాయతే. దీంతో ఈ అంశంపై ఆ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. మరోవైపు ఆరెస్సెస్ మాత్రం లింగాయత్‌ లను ప్రత్యేక మతంగా గుర్తించడాన్ని అంగీకరించబోమని స్పష్టంచేసింది. అయితే దానికి మీ అనుమతి అవసరం లేదంటూ లింగాయత్ నేతలు తిప్పికొట్టారు.

ఇదిలాఉండ‌గా...లింగాయత్‌ ల ఉద్యమంలోనూ విభేదాలు ఉన్నాయి. ఓ వర్గం వాళ్లు కొత్త మతానికి వీరశైవ లింగాయత్ అని పెట్టాలని డిమాండ్ చేస్తుండగా.. మరో వర్గం మాత్రం కేవలం లింగాయత్ అనే పిలవాలని అంటున్నారు. వీరశైవ హిందూ వేద సాంప్రదాయాలను పాటిస్తుందని - లింగాయత్‌ లు వాటికి వ్యతిరేకమన్న వాదన ఉంది. ఇప్పుడిదే సీఎం సిద్దరామయ్యకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. సొంత ప్రభుత్వం కూడా దీనిపై రెండుగా చీలింది. మంత్రి ఎంబీ పాటిల్ కేవలం లింగాయత్ అన్న పేరు పెట్టాలని అంటున్నారు. సీనియర్ ఎమ్మెల్యే శామనూర్ శివశంకరప్ప మాత్రం వీరశైవ లింగాయత్‌ గా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఓట్ల కోసం సిద్దరామయ్య తమను చీలుస్తున్నారని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ఆరోపిస్తున్నారు. లింగాయత్‌ లు - వీరశైవులు ఒక్కటేనని ఆయన స్పష్టంచేశారు. 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి అనుచరులే ఈ లింగాయత్‌లు. హిందూ మతంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. బసవేశ్వరుడు ఓ బ్రాహ్మణుడు. కానీ బ్రాహ్మణ సాంప్రదాయాలనే ఆయన వ్యతిరేకించారు. కులం లేని మతం అంటూ లింగాయత్ మతాన్ని స్థాపించారు. వీళ్లు శివలింగాన్ని మాత్రమే పూజిస్తారు.