Begin typing your search above and press return to search.

బ్రేక్ తొక్కబోయి.. ఎక్స్ లేటర్ తొక్కిన యువకులు

By:  Tupaki Desk   |   31 Jan 2022 4:54 AM GMT
బ్రేక్ తొక్కబోయి.. ఎక్స్ లేటర్ తొక్కిన యువకులు
X
కరీంనగర్లో కారు ప్రమాదం సంచలనం సృష్టించింది. సాధారణ ప్రమాదం అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఈ ప్రమాదంలో ప్రధానంగా నిర్లక్ష్యమే కనిపిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. యజమాని తన కారును మైనర్లకు ఇవ్వడంతో వారు రాష్ డ్రైవింగ్ చేసి నలుగురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని తెలుస్తోంది. అందుకే దీనిని ప్రమాద కేసు కాకుండా హత్యకేసుగా నమోదు చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. అంతేకాకుండా ఈ కారుపై ఇప్పటికే 7 ఓవర్ స్పీడ్ పెండింగ్ చలాన్లు ఉన్నాయని, అందువల్ల ఈ ప్రమాదానికి కారణం పూర్తిగా నిర్లక్ష్యమేనని తెలిపారు.

కరీంనగర్లో ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. వీరిలో ఓ యువతి సహా ముగ్గురు మహిళలు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. అంతేకాకుండా వీరంతా దరిదాపుగా ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. ప్రతీరోజు వ్యవసాయానికి అవసరమయ్యే పనిముట్లను తయారు చేయడం వారి విధి. కాయ కష్టం చేయనిదే పూటగడవని పరిస్థితి వారిది. ఎప్పటి లాగే ఆదివారం ఉదయమే తమ పనులను చేసుకునేందుకు కుటుంబ సభ్యులంతా నగరంలోని కమాన్ ప్రాంతంలో ఫుట్ పాత్ మీదకు వచ్చారు. కానీ అప్పటి వరకు తెలియదు తమకు ముప్పు పొంచి ఉందని..

ఉదయం 6.45 గంటలకు కమాన్ నుంచి హైదరాబాద్ వైపు ఓ తెల్లకారు ఓవర్ స్పీడ్ తో దూసుకొచ్చింది. (పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించిన తరువాత ఆ కారు 80 నుంచి 100 స్పీడులో ఉన్నట్లు తెలిసింది. ) అయితే ఇందులో ముగ్గురు కుర్రాళ్లే ఉన్నారు. వీరంతా రోజూ వాకింగ్ కోసంనగరంలోని అంబేద్కర్ స్టేడియానికి వెళ్తారు. ఆరోజు కూడా వేరే ప్రాంతానికి వెళ్తేందుకు ఆ కారులో బయలు దేశారు. అసలు విషయమేంటంటే ఆ ముగ్గురు మైనర్లే. అయితే డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడంతో పాటు రాష్ గా వెళ్లాలనే నెపంతో ఓవర్ స్పీడుగా కమాన్ నుంచి బయలు దేరారు. అయితే ఇంతలో బ్రేక్ పై కాలు వేయాల్సందిగా.. ఎక్సలేటర్ పై కాలు వేశారు.

అంతే.. ఆ కారు ఆగాల్సిందిపోయి కమాన్ నుంచి కొద్దిదూరంలో ఫుట్ పాత్ పై పనిచేసుకుంటున్న కూలీలపై దూసుకెళ్లింది. ఓ మహిళను దాదాపు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలొంది.మరో ముగ్గురిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన కుర్రాళ్లు కారును అక్కడే వదిలేసి పారిపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తరువాత సాయంత్రంలోగా ముగ్గురు యువకులతో పాటు కారు యజమానిని అరెస్టు చేశారు. అయితే మైనర్లకు కారు ఇవ్వడంతో యజమానికి కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ప్రమాదం పై విచారణ త్వరగా పూర్తిచేయాలని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతులు కుటుంబాలు ఆందోళన చేశాయి. వీరికి రాజకీయ నాయకులు బాసటగా నిలిచాయి. దీంతో ఈ సంఘటన దుమారం లేపినట్లయింది.

అయితే సాయంత్రం ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ప్రమాద కేసు కాకుండా హత్య కేసు నమోదు చేశామని కమిషనర్ తెలపారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యపు డ్రైవింగేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కారుపై అంతకుముందు 7పెండింగ్ చలాన్లు ఉండడంతో హత్య కేసు నమోదు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే మృతుల కుటుంబాలను ఆదుకుంటామని అధికార పార్టీ నాయకులు పేర్కొన్నారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి గంగుల కమలాకర్ బాధితులను పరామర్శించనున్నారు.