Begin typing your search above and press return to search.

క‌శ్మీర్ కు మోడీ స‌ర్కార్ భారీ స‌ర్జ‌రీ చేస్తుందా?

By:  Tupaki Desk   |   28 July 2019 4:32 AM GMT
క‌శ్మీర్ కు మోడీ స‌ర్కార్ భారీ స‌ర్జ‌రీ చేస్తుందా?
X
దేశ స‌రిహ‌ద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త‌లు లేవు. క‌శ్మీర్ వ్యాలీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు జ‌రుగుతున్న‌ది లేదు. ఎలాంటి ఉగ్ర కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌టం లేదు. మ‌రి.. ఇలాంటివేళ‌.. 10 వేల మంది సైనిక బ‌ల‌గాల్ని విమానాల్లో.. హెలికాఫ్ట‌ర్ల‌లో యుద్ధ ప్రాతిప‌దిక‌న ఎందుకు త‌ర‌లిస్తున్న‌ట్లు? ఆర్మీ చీఫ్ లాంటి అత్యున్న‌త స్థానంలో ఉన్న వ్య‌క్తి పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ ను తాము తిరిగి సాధిస్తామ‌ని.. దేశంలో క‌లుపుకుంటామంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌టం ఎందుకు? అస‌లు క‌శ్మీర్ లో ఏం జ‌రుగుతోంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికే ప్ర‌య‌త్నం చేస్తే..

క‌శ్మీర్ వ్యాలీలో క‌శ్మీరులు త‌ప్పించి భార‌తీయులతో స‌హా విదేశీయులు ఎవ‌రూ ఆస్తుల్ని కొనే వీల్లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. అక్క‌డ స్థిర నివాసానికి అవ‌కాశం ఉండ‌దు. ఇదే క‌శ్మీర్ కు ఉన్న పెద్ద స‌మ‌స్య‌. బ‌య‌ట‌వాళ్లు వ‌చ్చి ఉండ‌క‌పోవ‌టంతో.. క‌శ్మీర్ వ్యాలీలో ఎంట్రీ ప‌రిమిత‌మైన ప‌రిస్థితి. తాను రెండోసారి అధికారంలోకి వ‌స్తే క‌శ్మీర్ స‌మ‌స్య‌ను తేల్చేయ‌టంతో పాటు.. దానికి బైపాస్ స‌ర్జ‌రీ చేయ‌టం ద్వారా.. దేశంలో క‌లిసిన సంద‌ర్భంలో జ‌రిగిన త‌ప్పుల్ని స‌రిదిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న భావ‌న‌కు ప్ర‌ధాని మోడీ ఉన్న‌ట్లు చెబుతుంటారు.

తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఇందుకు బ‌లం చేకూరేలా ఉన్నాయి. ఇటీవ‌ల కాలంలో నియమించిన అద‌న‌పు బ‌ల‌గాల‌కు మ‌రింత ద‌న్నుగా నిలిచేందుకు ఏకంగా 10వేల మంది భ‌ద్ర‌తా సిబ్బందిని క‌శ్మీరుకు త‌ర‌లిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందిని ఇంత హ‌డావుడిగా క‌శ్మీర్ కు ఎందుకు పంపుతున్నారు? అన్న దానికి కేంద్రం కానీ ఆర్మీ అధికారులు కానీ ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఈ నిర్ణ‌యానికి ముందు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోభాల్ క‌శ్మీర్ రాష్ట్రంలో ప‌ర్య‌టించి రావ‌టంతో క‌శ్మీర్ లో ఏదో జ‌ర‌గ‌నుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న వాద‌నల ప్ర‌కారం క‌శ్మీరీల‌కు ప్ర‌త్యేక హ‌క్కులు క‌ల్పిస్తున్న రాజ్యాంగంలోని 35ఎ అధిక‌ర‌ణాన్ని కేంద్రం ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.

ఇంత‌కీ 35ఎ అధిక‌ర‌ణం ఏం చెబుతోందన్న విష‌యంలోకి వెళితే.. జ‌మ్మూ క‌శ్మీర్ లోని శాశ్వ‌త నివాసితుల హోదాను నిర్వ‌చించే సంపూర్ణ అధికారం ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది. ఈ హోదా ఉన్న వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. రాష్ట్రంలో ఆస్తుల కొనుగోలు.. ఉప‌కార‌వేత‌నాలు.. ఇంత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లో ప్ర‌త్యేక హ‌క్కులు ల‌భిస్తాయి. ఈ అధికారణం కింద రాష్ట్ర అసెంబ్లీ తీసుకునే ఎలాంటి చ‌ర్య‌ల్ని.. నిర్ణ‌యాల్ని రాజ్యాంగ ఉల్లంఘ‌న‌గా పేర్కొన‌టం సాధ్యం కాదు. నిజానికి ఈ అధిక‌ర‌ణ‌మే క‌శ్మీర్ లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని నియంత్రించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అందుకే.. ఆ అధికార‌ణాన్ని ర‌ద్దు చేయ‌టం ద్వారా.. క‌శ్మీర్ లో ద‌శాబ్దాలుగా ర‌గుతున్న రావ‌ణ‌కాష్టానికి ముగింపు ప‌ల‌కాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు.

ఈ అధికార‌ణ‌ను ర‌ద్దు చేయ‌టం ద్వారా క‌శ్మీర్ దేశంలోని మిగిలిన ప్రాంతాల‌తో స‌మాన‌మైన స్టేట‌స్ లోకి వ‌స్తుంద‌ని.. దీంతో క‌శ్మీర్ లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. త‌మ‌కు మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన 35ఎ అధికార‌ణాన్ని కేంద్రం ర‌ద్దు చేస్తుంటూ.. క‌శ్మీరీ నాయ‌కులు.. ఉద్య‌మ సంస్థ‌లు ఊరుకే ఉండ‌వు. ఆ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌తో పాటు.. నిర‌స‌న‌లు చోటు చేసుకుంటాయ‌న్న అంచ‌నా ఉంది. దానికి బ్రేకులు వేసేందుకు వీలుగా పెద్ద ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దించుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

35ఎ అధికార‌ణాన్నిర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించే పేరుతో పెద్ద ఎత్తున హింసాత్మ‌క కార్య‌క‌లాపాల‌కు తెగ‌బ‌డే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని.. జాతి వ్య‌తిరేక శ‌క్తులు హింస‌కు దిగే అవ‌కాశం ఉంద‌ని.. అలాంటి వాటిని నియంత్రించేందుకు వీలుగా పెద్ద ఎత్తున సైనిక బ‌ల‌గాల్ని త‌ర‌లిస్తున్న‌ట్లు చెబుత‌న్నారు.

కేంద్రం తీసుకునే నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌టంతో పాటు.. ఎక్క‌డా ఎలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌టం.. దీనికి ఒక సంకేతా నామాన్ని సైతం సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగాత‌ర‌లిస్తున్న అద‌న‌పు బ‌ల‌గాల్ని క‌శ్మీర్ లోని ఎయిర్ పోర్ట్.. రేడియో.. దూర‌ద‌ర్శ‌న్ కేంద్రాలు.. విద్యుదుత్ప‌త్తి కేంద్రాలు.. విద్యుత్ గ్రిడ్‌.. నీటి స‌ర‌ఫ‌రా.. ఆసుప‌త్రులు.. భ‌ద్ర‌తా శిబిరాల వ‌ద్ద మొహ‌రింపులు చేప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. అల్ల‌ర్లు సృష్టించే అవ‌కాశం ఉన్న వారి పేర్ల‌ను లిస్ట్ చేయ‌టంతో పాటు.. రాజ‌కీయ పార్టీలు.. నేత‌లు.. హురియ‌త్ నేత‌ల‌కు సంబంధించిన జాబితాల్ని సిద్దం చేశార‌ని చెబుతున్నారు. 35ఎ అధికార‌ణాన్ని ర‌ద్దు చేసే అంశంపై క‌శ్మీర్ కు చెందిన ప్రాంతీయ పార్టీల‌న్ని వ్య‌తిరేకిస్తున్నాయి. అయితే.. వాటిని ప‌ట్టించుకోకుండా క‌శ్మీర్ కు భారీ స‌ర్జ‌రీ చేయ‌టం ద్వారా శాశ్విత శాంతికి ఒక ప‌రిష్కార మార్గాన్ని మోడీ ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.