Begin typing your search above and press return to search.

అలూ లేదు..చూలు లేదు సీఎం అభ్యర్థి లోకేశ్ ఏంది కారెం?

By:  Tupaki Desk   |   9 Jun 2016 4:26 PM GMT
అలూ లేదు..చూలు లేదు సీఎం అభ్యర్థి లోకేశ్ ఏంది కారెం?
X
అలూ లేదు.. చూలు లేదు మొగుడు పేరు సోమలింగం అంటూ తాతల నాటి సామెతను చాలా రోజుల తర్వాత గుర్తు చేసినందుకు మొదట టీడీపీ ఎస్సీ.. ఎస్టీ సెల్ అధ్యక్షుడు కారెం శివాజీకి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పటివరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని చినబాబు గురించి కారెం జోస్యం చెప్పటం ద్వారా ఆయన మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించటమే కాదు.. ఆయన మనసులో లోతుగా ముద్రపడేందుకు చాలానే కష్టపడినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా తూర్పు గోదావరిజిల్లా రాజమండ్రిలో మాట్లాడిన ఆయన.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి నారా లోకేశ్ బాబు అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీని కార్యకర్తల స్థాయిలో బలోపేతం చేసేందుకు లోకేశ్ చాలానే కష్టపడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చొరవతో పార్టీ జాతీయ స్థాయి పార్టీగా కొత్త రూపం సంతరించుకుంటుందని చెప్పుకొచ్చారు. అయినా.. శివాజీకి ఈ తరహా పగటి కలలు ఎప్పటి నుంచి కంటున్నారు?

ఓపక్క తెలంగాణలో కాస్తో..కూస్తో ఉన్న పార్టీ కాస్త కేసీఆర్ పుణ్యమా అని హుష్ కాకి అయిపోతే.. ఆ విషయాన్ని వదిలేసి చినబాబు పుణ్యమా అని పార్టీ జాతీయ పార్టీగా కొంగత్త రూపం వస్తుందని చెబుతున్న మాటలు చూస్తే.. ఇలాంటి ఐస్ క్రీం మాటలే.. అధినేతల్ని.. వారి వారసుల్ని ఎక్కడికో తీసుకెళతాయని అనిపించక మానదు. ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి.. తన సత్తా చాటి.. మంత్రిగా తన పని తీరును ప్రదర్శించిన తర్వాత సీఎం అభ్యర్థి అని చెప్పుకుంటే బాగుంటుంది కానీ.. అదేమీ లేకుండా ఎప్పుడో మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రచారం చేసుకోవటం వినటానికే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందన్న విషయాన్ని చినబాబు అండ్ కో గుర్తిస్తే మంచిది.