యూట్యూబర్ తో కరాటే కల్యాణీ ప్రాంక్ చేయలేదు కదా..??

Fri May 13 2022 12:19:55 GMT+0530 (India Standard Time)

karate kalyani prank video news

హైదరాబాద్ లోని యూసఫ్ గూడ బస్తీలో ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి మరియు యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య గొడవ జరిగిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇద్దరూ రోడ్డుపై బూతులు తిట్టుకుంటూ కొట్టుకోవడం ఈ వీడియోల్లో కనిపిస్తుంది.ఈ వ్యవహారంలో ఇరువురు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే దీనిపై నెటిజన్లు పలు విధాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది స్క్రిప్టెడ్ వీడియోనా? యూట్యూబ్ స్టార్ తో కలిసి కరాటే కల్యాణీ కూడా ప్రాంక్ చేసిందా? లేదా నిజంగానే జరిగిందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పేరు పరిచయమే. అమ్మాయిలతో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే ఇవన్నీ కూడా స్క్రిప్టెడ్ ప్రాంక్ వీడియోలు. ఆ విషయం ఆ అమ్మాయిలతో పాటుగా యూట్యూబ్ లో చూసే వీక్షకులందరికీ తెలుసు.

అందుకే మొదట్లో ఈ ప్రాంక్స్ వీడియోలను లైక్ చేసినా.. తర్వాత రోజుల్లో ఇవి అందరికీ బోర్ కొట్టేశాయి. అయితే ప్రాంక్ పేరుతో అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి మహిళల గౌరవాన్ని దెబ్బతిస్తున్నాడంటూ ఇప్పుడు ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి పై కరాటే కల్యాణి దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే కల్యాణి పై శ్రీకాంత్ కూడా చేయి చేసుకోవడంతో ఆమె క్రింద పడిపోయింది.

'ఆడదానిగా ఈ సమాజంలో నువ్వు చూస్తున్న దుర్మారాగాన్ని చూడలేకపోతున్నా' అంటూ అసభ్య పదజాలంతో కల్యాణీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. శ్రీకాంత్ కూడా ఆవేశంతో బూతులు తిట్టడం చూడొచ్చు. ఈ గొడవలో కరాటే కల్యాణీతో పాటు మరో వ్యక్తి కూడా పాల్గొన్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

ఇందులో శ్రీకాంత్ రెడ్డి చిరిగిపోయి షర్ట్ తో రోడ్డు పై పరుగెత్తగా.. కల్యాణీ మనుషులు అతన్ని వెంబడిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న అనంతరం వీరిద్దరూ దగ్గరలోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

ఇంత జరిగినా ఇదంతా ప్రాంక్ వీడియో ప్లాన్ లో భాగమేనా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ పాపులర్ అవ్వాలనే అలా స్క్రిప్టెడ్ వీడియోతో వచ్చారని.. అందుకే గొడవ జరగక ముందు నుంచే వీడియో షూట్ చేసారని అంటున్నారు.

ఒకవేళ శ్రీకాంత్ ప్రాంక్ వీడియోలు అభ్యంతరకరంగా ఉంటే వాటిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు లేదా మహిళా సంఘాలు తరపున పోరాటం చేయొచ్చు. కానీ ఇలా వీడియో తీసుకుంటూ కల్యాణి అతనిపై దాడి చేయడం పై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ఇలా వార్తల్లో నిలవాలని చూస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వ్యవహారంలో చిన్న పిల్లతో సహా కల్యాణీ కింద పడిపోవడం.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయడం వల్ల ఈ గొడవ నిజంగా జరిగిందని స్పష్టంగా తెలుస్తుందని మరికొందరు అంటున్నారు. ఇందులో తప్పొప్పుల సంగతి పక్కన పెడితే.. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో ఇప్పుడు కరాటే కల్యాణీ - శ్రీకాంత్ ఇద్దరూ వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు.