Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ విగ్రహంపై సినీ నటి కుల రాజకీయం!

By:  Tupaki Desk   |   13 May 2023 11:13 AM GMT
ఎన్టీఆర్‌ విగ్రహంపై సినీ నటి కుల రాజకీయం!
X
ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి (రవితేజ కృష్ణ సినిమా ఫేమ్‌) మరో వివాదానికి తెరలేపారు. గతంలో పలు వివాదాల్లో ఆమె చిక్కుకున్న సంగతి తెలిసిందే. గతంలో యూట్యూబర్‌ శ్రీకాంత్‌ పై దాడి వ్యవహారం కలకలం రేపింది.

తాజాగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహంపై కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ 100వ జయంతి సందర్భంగా మే 28న ఖమ్మంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఖమ్మం ట్యాంక్‌ బండ్‌ పై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఆవిష్కరించడానికి రావాలని ఇటీవల తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ను కలిసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు తుది పనులు జరుగుతున్నాయి.

అయితే ఎన్టీఆర్‌ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉంది. దీనిపై నటి కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. శ్రీకృష్ణుడి గెటప్‌ లో ఎన్టీఆర్‌ ను పెట్టడం వల్ల యాదవులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కరాటే కళ్యాణి అంటున్నారు. ఎన్టీఆర్‌ ను శ్రీకృష్ణుడిగా పెట్టడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ కు కళ్యాణి మరికొందరుతో కలసి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఎన్టీఆరే కృష్ణుడిని, భగవద్గీతను బోధించింది కూడా ఎన్టీఆరే అని పరిస్థితిని తెస్తారని కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు.

కరాటే కళ్యాణి వ్యాఖ్యలపై ఖమ్మంలోని ఎన్టీఆర్‌ అభిమానులు స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామన్నారు. తాము యాదవ సామాజికవర్గంతో పాటు ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు చెందిన కరాటే కళ్యాణి ఇలా ఎందుకు బెదిరింపులకు పాల్పడుతోందని నిలదీశారు. యాదవ సామాజికవర్గానికి చెందిన స్థానిక నేతలు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని.. కళ్యాణికి మాత్రమే అభ్యంతరాలు ఎందుకొచ్చాయని ప్రశ్నిస్తున్నారు.

ఏడాదిన్నరగా ఎన్టీఆర్‌ విగ్రహం సిద్ధమవుతోందని ఎన్టీఆర్‌ అభిమానులు తెలిపారు. రాజకీయ ప్రస్తావన లేకుండా కేవలం ప్రేమతో, అభిమానంతోనే దీన్ని తయారుచేశామని వెల్లడించారు. ఈ బెదిరింపుల వెనుక కరాటే కళ్యాణి రాజకీయ ఆశయాలు, ఉద్దేశాలు ఉన్నాయని ఎన్టీఆర్‌ అభిమానులు ఆరోపించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఖమ్మం ట్యాంక్‌ బండ్‌లో ఈ నెల 28న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేస్తామని తేల్చిచెప్పారు.