Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర ద్రోహులు బాబు.. రామోజీ.. లాజిక్ చెప్పిన ధర్మశ్రీ

By:  Tupaki Desk   |   21 July 2020 9:45 AM IST
ఉత్తరాంధ్ర ద్రోహులు బాబు.. రామోజీ.. లాజిక్ చెప్పిన ధర్మశ్రీ
X
రాష్ట్రస్థాయి వార్తల్లో పెద్దగా కనిపించరు కానీ.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తాజాగా ఆయన ఏపీ విపక్ష నేత చంద్రబాబును.. ఈనాడు అధినేత రామోజీ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ద్రోహులుగా వారిద్దరిని అభివర్ణించారు. ఉన్నట్లుండి ధర్మశ్రీకి అంత కోపం ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నలుగా మారాయి.

ఇంతకీ విషయం ఏమంటే.. కోటి అరవై లక్షల ఏళ్ల క్రితం తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు సముద్రంలో చీలిక ఏర్పడినట్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తన పరిశోధనాంశాన్ని వెల్లడించారు. దీని కారణంగా 68 లక్షల ఏళ్లకు పూర్వం నుంచి 30 లక్షల ఏళ్ల పూర్వం వరకు ఆ చీలికలో అలజడి ఉండేదని.. దీని వల్ల భవిష్యత్తులో భూకంపాలు ఏర్పడే అవకాశం ఉందన్న విషయాన్ని ఒక ప్రొఫెసర్ చెప్పినట్లుగా ఈనాడులో రాయటం ఏమిటని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రను దెబ్బ తీయటానికి.. తమకు రావాల్సిన సెక్రటేరియట్ ను రాకుండా చేసేందుకు వీలుగా ఇలాంటి తప్పుడు ప్రచారానికి చంద్రబాబు.. రామోజీకలిసి కుట్రలు పన్నినట్లుగా ఆయన ఆరోపించారు. తమకున్న పలుకుబడితో రామోజీ.. తన పత్రికతో పాటు.. ఒక ఇంగ్లిషు పత్రికలోనూ ఇదే తరహా వార్తను అచ్చేయించి.. కొత్త కుట్రకు తెర తీసినట్లుగా ఆరోపించారు. ధర్మశ్రీ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక వార్తా కథనంపై ఇంతలా విరుచుకుపడటం ఇటీవల కాలంలో ఇదేనని చెప్పక తప్పదు.