Begin typing your search above and press return to search.

ప్ర‌కాశంలో బాబుకు బొమ్మే!..వైసీపీలోకి క‌ర‌ణం?

By:  Tupaki Desk   |   5 July 2018 6:36 AM GMT
ప్ర‌కాశంలో బాబుకు బొమ్మే!..వైసీపీలోకి క‌ర‌ణం?
X
ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశాలు మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ ప‌రిణామానికి సంబంధించి చాలా రోజుల నుంచి పుకార్లు షికారు చేస్తున్నా... ఇప్పుడు ఆ పుకార్లు నిజ‌మ‌య్యే రోజు రానే వ‌చ్చింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. రాజ‌కీయంగా ప్ర‌కాశం జిల్లా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ వెంటే న‌డిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా... వాటిలో వైసీపీ ఆరు చోట్ల విజ‌యం సాధించ‌గా - టీడీపీ ఐదు స్థానాల్లో మాత్ర‌మే నెగ్గింది. ఇక మ‌రో సీటులో న‌వోద‌యం పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌... టీడీపీ దిమ్మ‌తిరిగేలా విజ‌యం సాధించి స‌త్తా చాటారు. ఆ త‌ర్వాత అదికారంలోకి వ‌చ్చిన టీడీపీ... రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేస్తూ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు తెర తీసి... జిల్లాలో సొంత బ‌లంతో నెగ్గిన ఆమంచిని త‌మ‌వైపున‌కు లాగేసుకోవ‌డంతో పాటుగా వైసీపీ నుంచి విజ‌యం సాధించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌ ను కూడా త‌మ వైపు తిప్పేసుకుంది. ఈ రెండు మార్పుల‌తో ప్ర‌కాశం జిల్లాలో త‌మ‌దే పై చేయి అయ్యింద‌ని చెప్పుకున్న టీడీపీ నేత‌లు జ‌బ్బ‌లు చ‌రుచుకున్నారు. అయితే ఆ జ‌బ్బ‌లు చ‌రుకుచుకున్న వైనం ఇప్పుడు టీడీపీ దిమ్మ తిరిగే ఫ‌లితాన్నిచ్చేలానే ఉంద‌న్న వాద‌న వినిస్తోంది.

గొట్టిపాటి కుటుంబానికి.... ఆది నుంచి టీడీపీ తొలి త‌రం నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం ఫ్యామిలీకి విరోధం ఉంది. ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ఈ వైరం... గొట్టిపాటి టీడీపీలోకి చేరితే స‌మ‌సిపోతుంద‌ని టీడీపీ నేత‌ల‌తో పాటు ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కూడా భావించారు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధ ఫ‌లితాలు న‌మోదైన విష‌యం నిజంగానే బాబు అండ్ కోకు షాకిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ షాక్ నుంచి కోలుకోలేక‌ - అస‌లు అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న గొట్టిపాటి - క‌ర‌ణం ఫ్యామిలీల మ‌ధ్య ఉన్న విబేధాల‌ను తొల‌గించ‌డ‌మెలా? అన్న కోణంలో బాబు అండ్ కో నానా తంటాలు ప‌డుతోంది. వైరి వ‌ర్గం నుంచి వ‌చ్చిన గొట్టిపాటిని దూరం చేసుకునేంత ధైర్యం బాబుకు ఇప్పుడు లేద‌నే చెప్పాలి. అదే స‌మ‌యంలో పార్టీలో తొలిత‌రం నేత‌గా - ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న క‌ర‌ణం బ‌ల‌రాంను దూరం చేసుకునే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలో అద్దంకి నియోజ‌కవ‌ర్గం త‌నదంటే... కాదు త‌న‌దేన‌ని కొట్టుకుంటున్న క‌ర‌ణం - గొట్టిపాటిల‌ను స‌ముదాయించేదెలా? ఇందుకు ఇంత‌కంటే ప్ర‌త్యామ్నాయం లేద‌న్న రీతిలో చంద్ర‌బాబు ఓ మాస్టార్ ప్లాన్‌ను ర‌చించారు. ఆ ప్లాన్ ప్ర‌కార‌మే అద్దంకి నియోజ‌కవ‌ర్గాన్ని గొట్టిపాటికి వ‌దిలేయాల‌ని క‌ర‌ణంకు చెప్పిన బాబు... అందుకు ప్ర‌తిగా బ‌ల‌రాంకు ఎమ్మెల్సీ ఇచ్చారు.

మ‌రి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అద్దంకి బ‌రిలో నిలిచిన త‌న కుమారుడు వెంక‌టేశ్ ప‌రిస్ఖితి ఏమిట‌ని బాబును బ‌ల‌రాం గ‌ట్టిగానే నిల‌దీశారు. ఈ క్ర‌మంలో మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం క‌దా... వెంక‌టేశ్ కోసం వేరే నియోజ‌క‌వ‌ర్గం ఎంచుకోవాల‌ని సూచించారు. ఈ మాట క‌ర‌ణం బ‌ల‌రాంకు చాలా తెచ్చిపెట్టింది. ఈ క్ర‌మంలో తాను కూడా అద్దంకిని వ‌దిలేది లేద‌ని కూడా బ‌ల‌రాం గ‌ట్టిగానే బ‌దులిచ్చిన‌ట్లుగా స‌మాచారం. అయితే పార్టీ అధినేత‌గా బాబు ఓకే చేస్తేనే టీడీపీ టికెట్ ల‌భిస్తుంది క‌దా. మ‌రి అద్దంకిని గొట్టిపాటికి ఇచ్చేస్తున్నాన‌ని బాబు ముఖం మీదే చెప్ప‌డంతో క‌ర‌ణం ఇప్పుడు త‌న కుమారుడి కోసం ప్ర‌త్యామ్నాయం చూసుకోక త‌ప్ప‌ద‌ని భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న విప‌క్ష వైసీపీలోకి జంప్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ వార్త చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా... ఈ మ‌ధ్య ఆ వార్త నిజ‌మ‌య్యే సూచ‌న‌లు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ క‌ర‌ణం టీడీపీని వీడి వైసీపీలోకి చేరితే... ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ మ‌రింత బ‌లోపేతం కానుండ‌గా, టీడీపీ మ‌రింత‌గా దిగ‌జారిపోయే ప్ర‌మాదం లేక‌పోలేదు. మొత్తంగా ఆప‌రేష‌న్ అక‌ర్ష్ పేరిట బాబు చేసిన పెద్ద బ్లండ‌ర్‌... ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ కొంప ముంచేలా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.