Begin typing your search above and press return to search.

పోలవరం రగడ కవరింగ్‌కే కాపులకు రిజర్వేషన్?

By:  Tupaki Desk   |   1 Dec 2017 3:23 PM GMT
పోలవరం రగడ కవరింగ్‌కే కాపులకు రిజర్వేషన్?
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న హఠాత్తుగా పోలవరం విషయంలో వెనకడుగు వేయడం.. నిర్మాణ బాధ్యత కేంద్రానికే అప్పగిచ్చేస్తానంటూ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇది దుమారం రేపడంతో ఆయన నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ దుమారం వీలైనంత వేగంగా తెరమరుగు అయ్యేలా మరో కీలక అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు నిర్ణయించడం ఇందులో భాగమేనని విపక్షాలు - రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నిర్ణయించింది. మంజునాథ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపు - తెలగ - బలిజ - ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు వాల్మీకి - బోయలను ఎస్టీల్లో చేరుస్తూ కూడా మంత్రివర్గం తీర్మానించింది. వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేర్చాలని సత్యపాల్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ఆమోదముద్ర వేసింది.

కాగా మంత్రివర్గంలో నిర్ణయించిన కాపుల రిజర్వేషన్ అంశంపై మళ్లీ అసెంబ్లీలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ లపై అధికారిక ప్రకటన చేయడం చట్టసమ్మతం కాదని మంత్రులు చెబుతున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు మరోసారి కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరుగుతుందని.. ఆ తరువాత అసెంబ్లీలో దీనిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయొచ్చని చెప్తున్నారు.