Begin typing your search above and press return to search.

తునిలో అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   1 Feb 2016 4:51 AM GMT
తునిలో అసలేం జరిగింది?
X
కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న డిమాండ్ తో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలు భారీ హింసకు దారి తీశాయి. ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తునిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకునే పరిణామాలుఏం చోటు చేసుకున్నాయి? ఎలా చోటు చేసుకున్నాయి? అన్నది చూస్తే..

ఉదయం 9 గంటలు; గర్జనకు కాపుల రావటం షురూ

ఉదయం 10 గంటలు; అనుచరులతో సభకు చేరుకున్న ముద్రగడ పద్మనాభం

ఉదయం 11 గంటలు; వివిధ రకాల వాహనాలతో భారీగా తరలివచ్చారు

మధ్యాహ్నం 12 గంటలు; సభకు భారీగా హాజరైన జనం

మధ్యాహ్నం 2 గంటలు; సభ ప్రారంభమైనా ఎవరూ మాట్లాడే అవకాశం లేకపోవటం. వేదిక వద్దకు భారీగా జనం చొచ్చుకు రావటం.

మధ్యాహ్నం 2.45 గంటలు; ఒక నేత ప్రసంగం తర్వాత ముద్రగడ ప్రసంగం ప్రారంభం

మధ్యాహ్నం 3 గంటలు; కొద్ది మాటలతో ప్రసంగాన్ని పూర్తి చేసిన ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో.. రాస్తారోకోకు పిలుపునివ్వటం.. అప్పటికప్పు కాపుల్ని బీసీల్లోకి చేర్చేలా జీవో రిలీజ్ చేయాలంటూ అల్టిమేటం

మధ్యాహ్నం 3.15 గంటలు; తుని రైల్వేస్టేషన్ కు వచ్చిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై దాడి చేసిన ఆందోళనకారులు

మధ్యాహ్నం 3.30 గంటలు; తుని రైల్వే స్టేషన్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో ఉన్న వందలాది మంది ఏం జరుగుతుందన్న భయంతో వణికిపోయారు. రైలు దిగి పరుగులు తీశారు. చాలామంది తమ లగేజ్ ను వదిలేశారు. పిల్లా.. పాపలతో ఉన్న వారంతా ఏం జరుగుతుందోనని విపరీతంగా ఆందోళన చెందారు.కొందరు బయటకు రాలేక భయం.. భయంగా రైల్లో ఉండిపోయారు.

సాయంత్రం 4 గంటలు; రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు బండికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు. దీంతో రైల్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు.

సాయంత్రం 5 గంటలు; ఒకటి తర్వాత ఒకటిగా బోగీలన్నీ తగలబడిపోయాయి. రైల్లోని ప్రయాణికులు బాధలు అన్నిఇన్ని కావు. ఏం చేయాలో.. ఎటు పోవాలో అర్థం కాక భీతిల్లిపోయారు.

సాయంత్రం 6 గంటలు; ముద్రగడ అనుచరులను వాహనాల మీద నుంచి కిందకు దించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి మరింత చేజారిపోయింది. తమ వారిని అదుపులోకి తీసుకున్నారన్న ఆందోళనలతో పోలీస్.. ఇతర వాహనాల్నిఆందోళనకారులు తగలబెట్టారు.

రాత్రి 7.30 గంటలు; రత్నాచల్ రైలు పూర్తిగా దగ్థం కావటంతో పాటు.. ఆందోళనకారులు భారీగా తుని పట్టణంలోకి వచ్చారు. రూరల్ పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. రాస్తారోకో కారణంగా కిలోమీటర్ల పరిధిలో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ.. విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు.

రాత్రి 8 గంటలు; తుని పట్టణ పోలీస్ స్టేషన్ పై దాడితో పాటు.. ప్రభుత్వ వాహనాల దగ్థం.. పోలీసులపై దాడి.

రాత్రి 9 గంటలు; మరోసారి రైల్వేస్టేషన్ కు ఆందోళనకారులు వెళ్లే ప్రయత్నం చేయటంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు.. ఆందోళనకు వచ్చిన వారిలో చాలామంది తిరుగుముఖం పట్టేశారు.

రాత్రి 10 గంటలు; ముద్రగడ పద్మనాభం తన ఆందోళనను విరమించారు. అదనపు భద్రతా బలగాలు తుని పట్టణంలోకి వచ్చే అవకాశం కలిగింది.

రాత్రి 10.30 గంటలు; పరిస్థితి సాధారణ స్థితికి రావటం.. ఆందోళనకారుల్ని పంపే ప్రయత్నంతో పాటు.. ట్రాఫిక్ నుకంట్రోల్ చేసే అంశానికి పోలీసులు ప్రాధాన్యత.