Begin typing your search above and press return to search.

‘హింస’ కాపులకు మేలు చేస్తుందా?

By:  Tupaki Desk   |   1 Feb 2016 4:37 AM GMT
‘హింస’ కాపులకు మేలు చేస్తుందా?
X
డిజిటల్ యుగంలో కులాల గురించి ఇంత రచ్చ జరుగుతుందా? అన్న సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే.. ఇలా ఫీలయ్యే వారంతా కోస్తా ప్రాంతంలో అనుబంధం లేని వారు మాత్రమే అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా గుంటూరు మొదలుకొని ఉభయ గోదావరి జిల్లాల వరకు ‘‘కులం’’ చాలా పెద్ద పాత్రనే పోషిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో నెలల తరబడి పరిచయం ఉన్నా మాటల్లోకి రాని ‘‘కుల ప్రస్తావన’’ అందుకు భిన్నంగా ఈ నాలుగు జిల్లాల్లో మాత్రం పరిచయం అయిన పది నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ అలవాటు ఎలా వచ్చిందన్నది పక్కన పెడితే.. ఇప్పటికీ అదే రీతిలో ఉండటం.. ఈ ప్రాంతాలపై అవగాహన లేని వారికి ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతుంటారు.

కులం వ్యవహారాన్ని కాసేపు పక్కన పెడితే.. తాజాగా తునిలో చోటు చేసుకున్న ‘‘కాపు గర్జన’’ హింసాకాండను చూసినప్పుడు కులం ఇంత హింసకు కారణం అవుతుందా? అన్న భావన కలగక మానదు. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన ఈ పరిణామంలో ప్రభుత్వాల తప్పు ఉందని చెప్పకతప్పదు. ఒక సున్నితమైన అంశంపై పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని అంచనా వేసి ఉంటే.. కాపు గర్జన వరకు విషయాన్ని తీసుకొచ్చే వారు కాదేమో. అదే సమయంలో.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇంతటి హింసాకాండ ఏ మాత్రం సబబు కాదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.

హింసతో ఏ డిమాండ్ ను పరిష్కరించలేరన్న విషయాన్ని కాపు గర్జన నేతలు మర్చిపోయినట్లు కనిపిస్తోంది. అన్యాయం జరిగిన వాళ్లంతా హింసకు దిగితే.. పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం ఉండటం.. రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేయాలే కానీ.. హింసాకాండతో సామాన్య ప్రజల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేయటం ఏమాత్రం మంచిది కాదన్న విషయం మర్చిపోకూడదు. ఇలాంటి పరిణామాల కారణంగా కాపుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న వారు సైతం ఇప్పుడు అందుకు భిన్నమైన గళం వినిపించే ప్రమాదం ఉంది. ఏమైనా.. తాజా కాపుగర్జనలో చోటు చేసుకున్న పరిణామాలు.. కాపుల సమస్యలకు పరిష్కారం వెతికే అవకాశం కంటే మరిన్నిచిక్కుముడులు పడేందుకు కారణం అవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ పట్ల ఏపీ సర్కారు సానుకూలంగా స్పందిస్తే.. ఇదో తప్పుడు సందేశంగా మారే అవకాశం ఉంది. హింసకు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందన్న భావన కలుగుతుంది. అదే జరిగితే.. ప్రతి చిన్న అంశానికి విధ్వంసమే తప్ప మరో ఆలోచన ఆందోళన చేసే వారిలో ఉండదు. ఇదే రీతిలో కానీ ప్రభుత్వం తాజా ఉదంతాన్ని చూస్తే.. దాని వల్ల జరిగే నష్టం భారీగా ఉంటుందన్నది మర్చిపోకూడదు.