Begin typing your search above and press return to search.

కాపులకే పవన్ను పరిమితం చేసేస్తారా ?

By:  Tupaki Desk   |   29 Sep 2021 5:30 AM GMT
కాపులకే పవన్ను పరిమితం చేసేస్తారా ?
X
క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సినిమా టికెట్లను ఆన్ లైన్లో ప్రభుత్వమే అమ్మే ప్రతిపాదనపై నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతోందో అందరికీ తెలిసిందే. ఓ సినిమా ఫంక్షన్లో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వంపైనే కాకుండా జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్నినానిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దాంతో మంత్రులు, నాని పవన్ పై విరుచుకు పడ్డారు. ఇదంతా మంత్రులు-పవన్ అన్నట్లుగా జరుగుతోంది వ్యవహారం.

మధ్యలో హఠాత్తుగా కాపు సంక్షేమ సేన అని ఒకటి లేచింది. పవన్ను సమర్థిస్తు జగన్ను తప్పుపడుతూ, కాపు మంత్రులకు వార్నింగ్ ఇస్తూ ఓ లేఖ విడుదలైంది. కాపు సంక్షేమ సేనకు అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య. ఈయన పవన్ కు అత్యంత సన్నిహితుడు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈయన లేఖ విడుదల చేయగానే ఇతర ప్రాంతాల నుండి కుల సంఘాల పేర్లతో లేఖలు, మీడియా సమావేశాలు మొదలైపోయాయి.

కాపు సంక్షేమ సేన అయినా రాయలసీమ బలిజ మహా సంఘం పేరుతో వచ్చిన హెచ్చరికలను చూస్తే చివరకు పవన్ను కాపునేత స్ధాయికి దిగజార్చేసినట్లుంది. పవన్న ఏమైనా అంటే కాపులు ఊరికే ఉండరని వార్నింగులు ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో కాపులంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి బుద్ధి చెబుతారంటు గట్టి వార్నింగులే ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు ఎవరికి ఓట్లు వేస్తారు అనేది వేరే విషయం. ఎందుకంటే కాపులంతా ఎవరికి ఓట్ల వేయాలి ? అని నిర్ణయించేంత సీన్ ఏ సంఘం నాయకుడికి లేదు.

నేతలు చెప్పినంత మాత్రాన కాపులంతా ఒకపార్టీకి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో ఓట్లే వేయరు. ఈ విషయం గతంలో చాలాసార్లే రుజువైంది. కాబట్టి ఇక్కడ సమస్య కాపులు ఎవరికి ఓట్లు వేస్తారనేది కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాన్ని, జగన్+మంత్రిని తిట్టిన పవన్ కాపే. తిరిగి పవన్ను తిట్టిన మంత్రి నానీ కూడా కాపే. కాబట్టి కాపుల్లోనే కొత్తగా చీలికలు వస్తున్నాయని కూడా అనుకునేందుకు లేదు. ఎందుకంటే ఇప్పటికే కాపుల్లో అనేక సంఘాలున్నాయి. కాపుల్లోని అనైక్యతే రాజకీయంగా ఇబ్బందిగా మారిందని చాలామంది కాపునేతలు బహిరంగంగానే ప్రస్తావించారు.

కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాపులు, బలిజల పేరుతో పవన్ కు మద్దతు తెలపటం, హెచ్చరికలు జారీచేయటం ద్వారా పవన్ను కేవలం కాపునేతగానే సమాజం ముందు చిత్రీకరిస్తున్నారు కాపు నేతలు. నిజానికి పవన్ ఏమో తాను కాపునేతను కానని తనకు అన్నీ సామాజికవర్గాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కాపు నేతలేమో పవన్ స్ధాయిని పూర్తిగా దిగజార్చేస్తున్నారు. ఇది పవన్ కు ముందు ముందు ఇబ్బందులు తెచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి పవన్ కు మద్దతుగా మాట్లాడేటపుడు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది.