Begin typing your search above and press return to search.

పవన్‌ 'కాపు' కాయరేమో...!?

By:  Tupaki Desk   |   3 Dec 2018 10:51 AM IST
పవన్‌ కాపు కాయరేమో...!?
X
"మనం రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. సామాజికంగా ముందంజలో లేం. ఆర్ధికంగానూ పరిపుష్టిగా లేం. ఈ దశలో మనల్ని ఏ రాజకీయ పార్టీ ఆదుకుంటుందో వారికే మనం అండగా ఉండాలి" ఇది ఆంధ్రప్రదేశ్ లో కాపు నాయకుల మనోగతం. అంతే కాదు... కాపు కులానికి చెందిన వారెవరిని కదిపినా ఇదే విషయం చెబుతున్నారు. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో తన జాతికి లాభం కలుగుతుందని భావించి ఇతర పార్టీలో సీనియర్ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న వారంతా ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. తమకు - తన కులానికి వెన్నుదన్నుగా ఉంటాడనుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ముందే తాను తమ మనిషిని కాదని చెప్పేశారు. ఆ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ సమయంలోనే చిరంజీవి గురించి పూర్తి స్థాయిలో తెలిసిపోయిందంటున్నారు కాపు నాయకులు.

ఎన్నాళ్ల నుంచో కాపులకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కటం లేదని, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు చిరంజీవి పార్టీ వచ్చిందని తొలుత కాపు నాయకులందరూ భావించారు. అయితే టిక్కట్ల కేటాయింపుతోనే ఆయన ఆలోచ‌న ఇంకో విధంగా ఉన్న‌ట్టు తెలిసింది. ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ జనసేన పేరుతో పార్టీ పెట్టి కాపులకు అండగా ఉంటాడని నమ్మలేమనేది కాపు నాయకుల అనుమానంగా చెబుతున్నారు. దీనికి తోడు పవన్ కల్యాణ్ ప్రసంగాలు - చేస్తున్న పనులు కూడా కాపులకు ఆయనపై మరింత అనుమానాలను కలిగిస్తున్నాయంటున్నారు. ఇటీవల పార్టీలో పలువురు కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరారు. వారి చేరిక సమయంలోను - పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ కూడా తాను కులానికి ప్రాధాన్యత ఇవ్వనని పవన్ కల్యాణ్ బహిరంగంగానే చెప్పారంటున్నారు.

అంతే కాదు... ముఖ్యంగా కాపులకు తన పార్టీలో పెద్దగా అవకాశాలు కూడా ఉండవని - ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీలో ఉన్న కాపు నాయకులు అర్ధం చేసుకోవాలని సూచించారని సమాచారం. దీంతో కాపులకు రిజర్వేషన్లపై పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి సాయం ఉండదని కాపు నాయకులు నిర్ధారణకు వచ్చారని అంటున్నారు. " మాకు సాయం చేయకపోగా... తనను కుల నాయకుడు అంటారనే భయంతో వ్యతిరేకంగా కూడా చేయవచ్చు" అని కాపు నాయకుడొకరు వ్యాఖ్యానించారు. దీంతో మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ కు మద్దతు పలకాలనుకుంటున్న కాపులు ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారని చెబుతున్నారు.