Begin typing your search above and press return to search.

ముద్రగడపై పెరుగుతున్న కాపుల ఒత్తిడి!

By:  Tupaki Desk   |   11 Nov 2017 4:13 AM GMT
ముద్రగడపై పెరుగుతున్న కాపుల ఒత్తిడి!
X
ముద్రగడ పద్మనాభం అనుసరించిన కొన్ని వ్యూహాలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. కొన్ని రకాల వ్యూహాలతో ఆయన ఇన్నాళ్లూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద బురద చల్లడానికి ముద్రగడ ఎంచుకుంటూ వచ్చిన వ్యూహాలు ఇప్పుడు ఎందుకూ పనికి రానివిగా తేలిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన మీద సొంత మనుషులుగా నిలుస్తున్న కాపు వర్గం పెద్దలనుంచే ఒత్తిడి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కూడా పాదయాత్ర చేయాల్సిందే, అవసరమైతే అందుకు అనుమతి తీసుకోవాల్సిందే అని వారంతా ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

కాపు రిజర్వేషన్ సాధించడం కోసం పాదయాత్ర చేయబోతున్నా అంటూ ఆయన గతంలో చాలాసార్లు ప్రయత్నించారు. అయితే ప్రభుత్వాన్ని అనుమతి అడగలేదనే కారణం మీద ప్రతిసారీ పోలీసులు అరెస్టు చేసి.. ఇంట్లోనే నిర్బంధించారు. అనుమతి ఎందుకు అడగాలి.. అడగను గాక అడగను అనేది ఆయన మొండి పట్టుదల.

అయితే ఇప్పుడు ఆ పట్టుదల వదలుకోవాలని ఆయన మీద సొంత వర్గం కాపునేతలు ఒత్తిడి చేస్తున్నారట. జగన్ అంతటి వాడే పోలీసు అనుమతి తీసుకుని, నిబంధనల ప్రకారం వారు అడిగినట్లుగా అఫిడవిట్లు సమర్పించి పాదయాత్ర చేస్తోంటే.. తాము మాత్రం అనుమతి ఇవ్వలేదంటూ ఇంట్లో కూర్చోవడం వల్ల క్రెడిబిలిటీ పోతుందని వారు సూచిస్తున్నారట.

నిజంగానే తమకు కాపుల సమస్యను హైలైట్ చేయాలనే చిత్తశుద్ధి ఉన్నట్లుగా నిరూపించుకోవడానికి.. పాదయాత్ర చేసి తీరాల్సిందేనని, అవసరమైతే అనుమతి తీసుకుందాం అని వారు చెబుతున్నారట. తాము చట్ట ప్రకారం నడుచుకుంటే.. అప్పటికీ ప్రభుత్వం తిరస్కరిస్తే గనుక.. అప్పుడిక చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించడానికి తమకు ఇంకా మంచి పాయింటు దొరికినట్లుగా ఉంటుందని కూడా సూచిస్తున్నారుట. ఆ రకంగా తన వర్గం వారినుంచే వస్తున్న వత్తిడిని తట్టుకోలేక ముద్రగడ పద్మనాభం.. త్వరలోనే అనుమతి అడిగి అయినా సరే.. పాదయాత్ర చేయాలనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలోనూ అనుమతి గురించి ఆయనకు చాలా సలహాలు వచ్చాయి. అప్పుడే వినిఉంటే ఈ పాటికి తమ లక్ష్యం గురించి చంద్రబాబు మీద ఇంకా ఒత్తిడి పెరిగి ఉండేదని కాపుల్లో పలువురు భావిస్తున్నట్లు తెలుస్తోంది.