Begin typing your search above and press return to search.

కపిల్ సిబల్ సంచలనం.. ఆత్మరక్షణలో పడేలా వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   30 Sep 2021 7:33 AM GMT
కపిల్ సిబల్ సంచలనం.. ఆత్మరక్షణలో పడేలా వ్యాఖ్యలు
X
మోడీ ఇచ్చిన ఓటమి షాక్ నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని చేపట్టేందుకు పూర్తికాలపు నేత లేకపోవటం.. ప్రస్తుతానికి తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ.. అంత యాక్టివ్ గా లేని వేళ.. సమస్యల సుడిగుండంలో కిందామీదా పడుతోంది ఆ పార్టీ. అధికారంలో ఉన్న గుప్పెడు రాష్ట్రాల్లో ఏదో ఒక సమస్యతో తలపోటును ఎదుర్కొంటున్న ఆ పార్టీకి పంజాబ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు గుదిబండలా మారాయి.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తో సిద్ధూకు విభేదాలు రావటంతో మొదలైన సంక్షోభం.. అనంతరం సిద్ధూకు పంజాబ్ పీసీసీ చీఫ్ గా ఎంపిక చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం కుర్చీలో దళిత నేత చరణ్ జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ అమిత్ షాను కలవటం ఒక సంచలనంగా మారితే.. మరోవైపు పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసి.. ఆ కుర్చీలో కూర్చొబెట్టిన నవజ్యోత్ సింగ్ సిద్దూ అకస్మత్తుగా ఆ పదవికి రాజీనామా చేసిన వైనం ఇప్పుడు మరో షాకింగ్ గా మారింది. ఇవన్ని సరిపోనట్లు.. సిద్ధూకు సన్నిహితుడైన ఒక మంత్రి.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి.

ఇలాంటివేళలోనే.. సీనియర్ నేత.. గత ఏడాది ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి పార్టీ తీరుపై లేఖతో తమ అసంత్రప్తిని వ్యక్తం చేసిన వారిలో ఒకరైన కపిల్ సిబల్ విలేకరుల ముందుకు వచ్చారు. పంజాబ్ లో జరుగుతున్న పరిస్థితులపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. గతంలో తాము రాసిన లేఖ ప్రస్తావనను తీసుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయనేమన్నారంటే..

- గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన కాంగ్రెస్ నేతల తరపున నేను మీడియాతో మాట్లాడుతున్నా.

- కాంగ్రెస్ పార్టీకి సారథి లేరు. ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో నాకు తెలీదు. మా డిమాండ్లను తెరపైకి తెస్తూనే ఉంటాం.

- పార్టీ అధ్యక్ష పదవికి, సీడబ్ల్యూసీకి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఎన్నికల నిర్వహణకు సంబంధించి తమ పార్టీ నాయకత్వం చేపట్టబోయే చర్యల కోసం ఎదురు చూస్తున్నా.

- మేం (జీ 23 నేతలు) పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయేవాళ్లం కాదు. పార్టీ అధిష్ఠానానికి సన్నిహితులుగా పేరు పడిన వారు అధిష్ఠానాన్ని వదిలిపెట్టారు. అధిష్ఠానానికి సన్నిహితులు కాని వారుగా పేరు పడిన వారు అధిష్ఠానంతో కలిసి ఉన్నారు.

- తాము
- ప్రస్తుతం మనం ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉన్నామనే విషయాన్ని చర్చించేందుకు సీడబ్ల్యూసీని వెంటనే సమావేశ పరచాలని ఒకరు లేఖ రాసినట్లుగా నేను భావిస్తున్నా. (ఈ లేఖ రాసింది గులాబ్ నబీ అజాద్ అన్న మాట వినిపిస్తోంది)

- మా పార్టీకి ప్రెసిడెంట్ లేరు. అందువల్ల ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలీదు. మాకు తెలుసు కానీ ఏమీ తెలీదు.

- సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ లో కాంగ్రెస్ కు ఈ విధంగా జరుగుతుందంటే అర్థం ఏమిటి? ఇలాంటి వాటి వల్ల పాకిస్థాన్ కు.. ఐఎస్ఐకు ప్రయోజనం కలుగుతుంది.

- పంజాబ్ చరిత్ర మనకు తెలుసు. అక్కడ తీవ్రవాదం పెరగటం గురించి తెలుసు. సమైక్యంగా ఉన్నామనే భరోసాను కాంగ్రెస్ కల్పించాలి. ఎవరికైనా సమస్యలు ఉంటే చర్చించవచ్చు.

- మేం జీ 23 నేతల. జీ హుజూర్ 23 నేతలం కాదు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మేం మాట్లాడుతూనే ఉంటాం. మా డిమాండ్లను పునరుద్ఘాటిస్తుంటాం. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయంపై దేశంలోని ప్రతి కాంగ్రెస్ నేత ఆలోచించాలి.

- పార్టీని విడిచిపెట్టిన వారంతా తిరిగి రావాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ గణతంత్ర దేశాన్ని కాపాడగలదు.