Begin typing your search above and press return to search.

ఆ సీఎం రూ.2కోట్ల లంచం తీసుకున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   7 May 2017 11:33 AM GMT
ఆ సీఎం రూ.2కోట్ల లంచం తీసుకున్నార‌ట‌!
X
ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ టైం ఏమాత్రం బాగున్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తిదీ ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా మారుతుండ‌టం గ‌మ‌నార్హం. మొన్న‌టికి మొన్న జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పంజాబ్‌.. గోవాల‌లో కేజ్రీవాల్‌ కు షాక్ త‌గ‌ల‌టం తెలిసిందే. దాని నుంచి కోలుకుంటున్నంత‌లో ఢిల్లీ మున్సిపాలిటీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దారుణ ప‌రాజ‌యం పాలైంది. దీంతో.. కేజ్రీవాల్ స‌మ‌ర్థ‌త మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చిన ప‌రిస్థితి.

ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా పార్టీలో చోటు చేసుకున్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో రోజుకో వార్త‌తో ఆమ్ ఆద్మీపార్టీ మీడియాలో ప్ర‌ముఖంగా నానుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ రాష్ట్ర మంత్రివ‌ర్గం నుంచి ఉద్వాస‌న‌కు గురైన మాజీ మంత్రి క‌పిల్ మిశ్రా.. ఢిల్లీ ముఖ్య‌మంత్రిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న క‌ళ్ల ముందే ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోగ్య‌శాఖా మంత్రి స‌త్యేంద్ర జైన్ నుంచి రూ.2కోట్ల లంచం తీసుకున్నట్లుగా ఆరోపించారు. అంతేనా.. కేజ్రీవాల్ త‌న బంధువుల కోసం రూ.50 కోట్ల భూదందాల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లుగా కూడా త‌న‌తో మంత్రి జైన్ చెప్పార‌న్నారు.

త‌న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్న‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. వాటిని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఎదుట పెడ‌తాన‌న్నారు. కేజ్రీవాల్‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఇందుకు సీబీఐ.. ఏసీబీని ఆశ్ర‌యించ‌నున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పేల‌వ‌మైన ప‌ని తీరు కార‌ణంగానే క‌పిల్ మిశ్రా మీద వేటు వేసిన‌ట్లుగా ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియా స్ప‌స్టం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రిపై ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు ఏమాత్రం నిజం కావ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి తాను ఒక స‌భ్యుడిన‌ని.. తాను ఆప్ పార్టీలోనే ఉంటాన‌ని.. త‌న‌ను పార్టీ నుంచి ఎవ‌రూ త‌ప్పించ‌లేర‌ని చెప్పుకొచ్చారు. మ‌రి.. త‌న పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒక‌రు త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఏం స‌మాధానం ఇస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/