Begin typing your search above and press return to search.

మాకొద్దీ ఏపీ పాలన అంటున్నారు!

By:  Tupaki Desk   |   21 July 2022 7:30 AM GMT
మాకొద్దీ ఏపీ పాలన అంటున్నారు!
X
పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ప్ర‌స్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో వివాదం రేగుతోంది. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అన్నంత వ‌ర‌కూ త‌గువు వెళ్తోంది. మొదట రాజకీయం దీనిని రాజ‌కీయం చేయ‌వ‌ద్ద‌ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వేడుకుంటున్నారు.

త‌న మాట‌ల‌ను అర్థం చేసుకోవాల‌ని కోరుతున్నారు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం పోల‌వరం పరిధిలో ఉన్న ఐదు ఊళ్ల‌నూ తెలంగాణ‌లోనే విలీనం చేయాల‌ని, తాము ఆంధ్రాలో ఉండ‌బోమ‌ని ఆదివాసీలు చెబుతున్నారు. ఈ మేరకు వాళ్లంతా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

నిన్న‌టి వేళ కూడా ఇదే విధంగా నిరస‌న‌లు వ్య‌క్తం చేశారు. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఎట‌పాక‌, గుండాల, పురుషోత్త ప‌ట్నం, క‌న్నాయిగూడెం, పిచ్చుక‌ల‌పాడు ప్ర‌జ‌లు నిన్న‌టి వేళ రోడ్డెక్కారు. విభ‌జ‌న ప‌ర్వం అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విలీనం చేసిన త‌మ గ్రామాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని విన్నవిస్తున్నారు. ఈ మేరకు క‌న్నాయిగూడెం ప్ర‌ధాన ర‌హ‌దారిపై ధ‌ర్నా చేప‌ట్టారు.

ఇప్ప‌టికే జిల్లాల విభ‌జ‌నే ఓ త‌ల‌నొప్పిలా ఉంది. ఇక్క‌డి ప్రాంతాన్ని మ‌న్యం జిల్లాగా అల్లూరి సీతారామ‌రాజు పేరిట ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటుపై కూడా ఇంకా స్ప‌ష్ట‌త లేదు. క‌నీస వ‌స‌తుల క‌ల్ప‌న‌కు నిధులే లేవు.

తాజాగా గొడ‌వ‌ల నేప‌థ్యంలో రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ పరిధిలో ఉండే ఈ గ్రామాలు అన్నీ కూడా తెలంగాణ‌లో విలీనం అయితే మ‌రో కొత్త వివాదం పరిహారం విష‌య‌మై రేగ‌వ‌చ్చు. పున‌రావాసం విష‌య‌మై రేగ‌వ‌చ్చు. ఇప్ప‌టికే పోల‌వ‌రం అడ్డుకోవాల‌న్న త‌లంపుతోనే తెలంగాణ ఉంద‌ని పేర్నినాని లాంటి మాజీ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఐదూళ్ల త‌గువు పార్ల‌మెంట్ వ‌ర‌కూ వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో కొన్ని విష‌యాల‌పై ముఖ్యంగా జీఎస్టీపై పోరాటం చేస్తున్న ఎంపీ ప‌సునూరి ర‌వీంద‌ర్ బృందం రేప‌టి వేళ భ‌ద్రాచ‌లం ముంపు విష‌యాన్ని, అదేవిధంగా ఐదూళ్ల విలీనాన్ని తెర‌పైకి తీసుకు వ‌చ్చే అవ‌కాశాలే పుష్క‌లంగా ఉన్నాయి. అదే క‌నుక జ‌రిగితే మ‌రో విభ‌జ‌న త‌గాదా షురూ అయ్యే వీలుంది.