Begin typing your search above and press return to search.

కన్నడ హీరోపై సీఎం ఫైర్.. ఇదేంటి స్వామీ!

By:  Tupaki Desk   |   17 April 2019 12:58 AM IST
కన్నడ హీరోపై సీఎం ఫైర్.. ఇదేంటి స్వామీ!
X
ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుగా.. ఉన్నట్టుండి కుమారస్వామికి కన్నడ స్టార్ హీరో యశ్ మీద కోపం వచ్చింది. మండ్య లోక్ సభ ఎన్నికల పరిణామాల్లో భాగంగా యశ్ మీద ఫైర్ అయ్యారు కుమారస్వామి. యశ్ లాంటి వాళ్లు బతుకీడుస్తున్నారంటే అది తన లాంటి వాళ్ల దయే అని కుమారస్వామి చెప్పుకొచ్చారు. యశ్ మాత్రమే కాదట.. సినిమా వాళ్లంతా తన లాంటి వాళ్ల మీద ఆధారపడే బతుకీడుస్తున్నారని కుమారస్వామి చెప్పుకొచ్చారు.

అదేంటి.. అంటే, పూర్వాశ్రమంలో కుమారస్వామి సినీ నిర్మాత కదా, ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారీయన. తనలాంటి నిర్మాతలు సినిమాలు తీయడం వల్ల యశ్ లాంటి హీరోలు బతుకీడుస్తున్నారని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఇది ఒకింత అసంబద్ధమైన వాదన అని చెప్పవచ్చు.

ఎందుకంటే.. సినీ ఇండస్ట్రీలో పరస్పరం ఒకరి మీద మరొకరు ఆధారపడక తప్పదు. ఆ విషయాన్ని గుర్తించక ఇలా మాట్లాడటం ఏమిటో. ఇంతకీ యశ్ మీద కుమారస్వామికి ఎందుకంత కోపం వచ్చింది? అంటే.. మండ్యలో సుమలతకు మద్దతుగా ప్రచారం చేశాడు యశ్. సుమలత తరఫున నామినేషన్ రోజు నుంచి ఆ హీరో వెంట ఉన్నాడు. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నాడు. ప్రచారం చేసి పెట్టాడు.

దీంతో కుమారస్వామికి కోపం వచ్చింది. అందుకే ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు కుమారస్వామి. సినిమా హీరోలను నమ్మొద్దని.. వారు తెరపై చూపించేదంతా అబద్ధమని కుమారస్వామి చెప్పుకొచ్చారు.