Begin typing your search above and press return to search.

జగన్ నిర్ణయంతో కన్నడ హీరో ఎంట్రీ...యడ్డీ దిగొచ్చారు!

By:  Tupaki Desk   |   12 Aug 2019 9:59 AM GMT
జగన్ నిర్ణయంతో కన్నడ హీరో ఎంట్రీ...యడ్డీ దిగొచ్చారు!
X
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను కల్పించాల్సిందేనంటూ వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం.. పొరుగు రాష్ట్రంలోని కన్నడిగులను మేల్కొలిపింది. మేల్కొలపడమే కాదండోయ్... ఏకంగా కర్ణాటక కొత్త సీఎం బీఎస్ యెడ్యూరప్ప కూడా జగన్ నిర్ణయాన్ని అమలు చేస్తామంటూ దిగొచ్చేదాకా పరిస్థితి వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో కన్నడ హీరో ఉపేంద్ర కీలకంగా మారారు. వెరసి ఇప్పుడు ఏపీ మాదిరే కన్నడ నాట ఎవరు పరిశ్రమలు పెట్టినా... వాటిలో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.

ఆసక్తి రేకెత్తించే ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్.... రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చే చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించడం - జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తానిచ్చిన హామీల అమలుపై జెట్ స్పీడుతో కదులుతున్న జగన్... పరిశ్రమల్లో 75 శాతం కొలువులు స్థానికులకు ఇవ్వాల్సిందేనన్న విషయంపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కన్నడ హీరో ఉపేంద్ర... ఏపీ మాదిరే కన్నడ నాట కూడా స్థానికులకు తగినంత కొలువులు దక్కితే బాగుంటుంది కదా అన్న దిశగా ఆలోచించారు.

అనుకున్నదే తడవుగా కన్నడ నాట కూడా ఏపీ మాదిరే ఎవరు పరిశ్రమలు పెట్టినా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ ను లేవనెత్తారు. ఉపేంద్ర మొదలెట్టిన ఈ డిమాండ్... కన్నడ నాట జనాల్లోకి బాగానే దూసుకెళ్లింది. దీనిపై ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుందన్న వార్తలూ వినిపించాయి. విషయాన్ని తన నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న యెడ్యూరప్ప... జనం ఉద్యయ బాట పట్టే కంటే ముందుగానే ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే పోతుందిగా అన్న దిశగా ఆలోచించారు. తాను కర్ణాటక సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినా... ఇంకా కేబినెట్ ను ఏర్పాటు చేసుకునే విషయంలో యడ్డీ చాలా ఇబ్బందులే పడుతున్నారు. ఎందుకంటే... టెక్నికల్ గా మెజారిటీ ఉన్న యడ్డీ సర్కారుకు పూర్తి స్థాయి మెజారిటీ లేదనే చెప్పాలి.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్థానికులకు ఉద్యోగాలపై జనం ఉద్యమిస్తే... పరిస్థితి చేజారిపోతుందన్న బెంగతో యడ్డీ... జనం రోడ్డెక్కకముందే మేల్కొన్నారు. ఉపేంద్ర డిామాండ్ న్యాయమైనదేనన్న భావనతో కర్ణాటకలోనూ ఏపీ మాదిరే ఏ పరిశ్రమ పెట్టినా... అందులో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని యడ్డీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో దీనిపై ఏపీ మాదిరే కర్ణాటక కూడా త్వరలోనే స్థానికులకు ఉద్యోగాలపై ఉత్తర్వులు జారీ చేయనున్నట్లుగా సమాచారం. మొత్తంగా జగన్ తీసుకున్న ‘లోకల్’ నిర్ణయం ఉపేంద్రను కదిలిస్తే... దానిని అమలు చేసే దిశగా యడ్డీ కదిలారని చెప్పక తప్పదు.