Begin typing your search above and press return to search.

నిప్పు అని చెప్పుకొనే బాబు..ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబివ్వు?

By:  Tupaki Desk   |   8 Aug 2018 3:49 PM GMT
నిప్పు అని చెప్పుకొనే బాబు..ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబివ్వు?
X
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మ‌రోమారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై విరుచుకుప‌డ్డారు. అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించింది మొద‌లు బాబు మొదలు టీడీపీ - ఆ పార్టీ ఏలుబ‌డిపై మండిప‌డుతున్న క‌న్నా ఇటీవ‌ల కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతీ వారం 5 ప్రశ్నలు సంధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను - అవినీతిని - అప్రజాస్వామిక వ్యవహారశలినీ ప్రశ్నిస్తున్నానంటూ 6వవారం ముఖ్యమంత్రికి కన్నా లక్ష్మీనారాయణకు మ‌రికొన్ని ప్రశ్నలు సంధించారు. దీంతో పాటుగా ఢిల్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై కూడా బీజేపీ రాష్ట్ర శాఖ త‌ర‌ఫున ఆయ‌న స్పందించారు. కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్ చాంబ‌ర్‌ లో ఆయ‌న‌కు - టీడీపీ ఎంపీల‌కు మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదంపై మండిప‌డ్డారు.

కేంద్ర రైల్వే మంత్రి కార్యాలయంలో విశాఖ రైల్వే జోన్ పై జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు గూండాల్లా ప్రవర్తించి - భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై - ఎంపీ కంభంపాటి హరిబాబుపై దౌర్జన్యం చేశారని బీజేపీ రాష్ట్ర కమిటీ విరుచుకుప‌డింది. ఈ ఘటనపై పియూష్ గోయల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని - ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ లో జీవీఎల్ నరసింహారావుపై బహిరంగ హెచ్చరికలు చేస్తూ దౌర్జన్యాన్ని చాటుకుంటున్నారని ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్‌ లో తిరగనియమని బెదిరిస్తున్నారు కాబట్టి వెంటనే జీవీఎల్ నరసింహారావుకి మరింత భద్రత కల్పించవలసిందిగా - ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామ‌న్నారు.

చంద్ర‌బాబుకు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సంధించిన ప్ర‌శ్న‌లు ఇవి....

- రాష్ట్రం అష్టకష్టాలలో ఉంది అంటూంటారు. మీ దుబారా అంతా రాష్ట్రం మీద రుద్దటానికి సిగ్గు వేయటం లేదా? సుమారు ఏడాది పాటు స్టార్ హొటల్లలో ఉండి 30 కోట్లు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడానికి సిగ్గు లేదా? ప్రజలసొమ్మును ఇలా దుర్వినియోగం చేయవచ్చా?

- మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో - రిజర్వేషన్లు మరియు వారి మొత్తం రిజర్వేషన్లను 33 1/3% కు పెంచుతామని హామీయిచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేయలేదా?ఇది మోసం, అన్యాయంకాదా? ఒక్కనిమిషమైనా ముఖ్యమంత్రిగా కొనసాగే మొరాలిటీ మీకుందా?

- ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జలవనరులు - నీటిపారుదలశాఖలో జరిగిన వేలాదికోట్ల రూపాయల కుంభకోణంపై సీబీఐ విచారణకు సిధ్ధంగా ఉన్నారా?

- విద్యుత్తు ఉత్పత్తిలో బ్రహ్మాండమైనప్రగతిని సాధించామని కోతలు కోస్తున్నారు, ఈ నాలుగు సంవత్సరాల లోపు మీ అదనపు విద్యుత్తు కొనుగోళ్లపై చేసిన ఖర్చు - వసూలు చేసిన కమిషన్లపై సీబీఐ విచారణకు సిద్ధమా?

- తెల్లారిలేస్తే నేను నిప్పు అనేమీకు మీమీదవున్న 18 స్టేలకి సమాధానం చెప్పే ధైర్యం ఉందా ?? మరి మీరు నిప్పుఐతే స్టేలు వెకేట్ కావాలి కదా? ఇంకా స్టేలు ఇన్నాళ్ళు ఎందుకు ఉన్నాయా? స్టేలతోనే పరిపాలనను కొనసాగిస్తారా?

పూర్తిగా అవినితీలో కూరుకుని అనేక అరాచకాలు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ఎండగడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు సంధించిన ఈ ప్రశ్నలకు చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా ??