Begin typing your search above and press return to search.

బీజేపీ కన్నాకు జనసేన మిన్న

By:  Tupaki Desk   |   15 Dec 2022 1:30 AM GMT
బీజేపీ కన్నాకు జనసేన మిన్న
X
గుంటూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన మంత్రిగా కాంగ్రెసులో పనిచేశారు. కీలకమైన శాఖలను అనేకం నిర్వహించిన కన్నా పేరు ఒక దశలో సీఎం పదవికి కూడా వినిపించింది. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య రాష్ట్రం కోరుతూ రాజీనామా చేసిన తరువాత సీఎం రేసులో ఉన్న  వారిలో కన్నా ఒకరు. ఇక విభజన జరిగిన తరువాత కన్నా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. 2019 ఎన్నికల ముందు  మాత్రం ఆయన పార్టీ మారాలనుకుని వైసీపీ వైపు మొగ్గారు.

అయితే బీజేపీని ఆయన్ని లాక్ చేసి ఏకంగా బీజేపీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది. దాంతో కన్నా హవా కాషాయం పార్టీలో కొన్నాళ్ళు సాగింది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కావడం, కన్నా ప్రెసిడెంట్ పదవి కూడా కోల్పోవడం జరిగాయి. పార్టీ సెంట్రల్ లో అధికారంలో ఉంది కాబట్టి రాజ్య సభకు అయినా నామినేట్ చేస్తారనుకుంటే అది కూడా జరగలేదు. ఇక రెండేళ్ల క్రితం సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక కన్నా కొంత ఎడం పాటిస్తున్నారు.

పార్టీ యాక్టివిటీని ఆయన తగ్గించుకున్నారా లేక దూరం పెట్టారా అన్నది తెలియదు కానీ కన్నా మాత్రం బీజేపీ మీద అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఈ మధ్యనే ఆయన సోము వీర్రాజు మీద డైరెక్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ తో ఆయన బాధ ఏంటి అన్నది బయటపడింది అంటున్నారు. జనసేనతో బీజేపీ పొత్తును పటిష్టం చేసుకుని పార్టీని బలోపేతం చేయకుండా సోము వ్యవహరించారు అంటూ కన్నా చేసినా వ్యాఖ్యలు కమలం పార్టీలో మంటను పుట్టించాయి.

ఇక నాటి నుంచి ఆయన బాగా తగ్గి ఉంటున్నారు. ఆయన పార్టీ మారుతారు అని అంతా అనుకుంటున్నారు. ఆయన జనసేనలో చేరుతారు అని కూడా ఒక ప్రచారం ఉంది కానీ పొత్తుల వ్యవహారం ఏంటో చూసిన తరువాతనే కన్నా తన డెసిషన్ బయటపెడతారు అని అంటున్నారు. ఈలోగా కన్నా ఇంటికి సడెన్ గా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వెళ్లడం, ఆయనతో మంతనాలు జరపడం హాట్ టాపిక్ గా మారింది.

నాదెండ్ల గుంటూరుకు చెందిన వారే. పైగా నాదెండ్ల కన్నా ఇద్దరూ కూడా కాంగ్రెస్ నాయకులే. అందులోనే పనిచేసి వచ్చిన వారే. జనసేన బలోపేతానికి నాదెండ్ల గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకే ఆయన వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. దాతో కన్నాను నాదెండ్ల కలవడం రాజకీయంగా చర్చకు తావిస్తోంది. ఈ నెల 18న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జనసేన రైతు భరోసా యాత్ర ఉంది. ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు.

మరి పవన్ని కూడా కన్నా కలుస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా 2009 తరువాత గెలుపు చూడని కన్నా కాంగ్రెస్ బీజేపీల  వల్ల కాదని గ్రహించి జనసేన బెస్ట్ ఆప్షన్ అని ఎంచుకుంటున్నారా అన్నదే చూడాల్సి ఉంది. ఆయన కనుక పార్టీ మారితే బీజేపీకి లాస్. మరి మిత్రపక్షంగా జనసేన ఉంది. అందులో కన్నా చేరడం అంటే కాషాయం పార్టీ ఎలా చూస్తుందో. పైగా బీజేపీని జనసేన టార్గెట్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.