Begin typing your search above and press return to search.

బాబుది సంస్కారం లేని ప్ర‌వ‌ర్త‌న..తిట్ట‌డ‌మే ప‌ని

By:  Tupaki Desk   |   9 July 2018 4:56 PM GMT
బాబుది సంస్కారం లేని ప్ర‌వ‌ర్త‌న..తిట్ట‌డ‌మే ప‌ని
X
ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై విరుచుకుప‌డ్డారు. విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించిన సంద‌ర్భంగా - అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరును త‌ప్పుప‌ట్టారు. ప్రకాశం జిల్లాలోని కొన్ని లక్షల మందికి తాగునీరు - సాగునీరు ఇచ్చే వెలిగొండ ప్రాజెక్ట్‌ ను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని రామాయపట్నం పోర్ట్‌ విషయంలో కూడా చంద్రబాబు పూర్తి నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారని, పోర్టు ఏర్పాటుకు కేంద్రానికి ఇప్పటికీ ఎందుకు ప్రతిపాదనలు పంపడం లేదని ప్రశ్నించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం కేంద్రం వివరాలు అడుగుతుంటే ఇవ్వకుండా భూటకపు దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. కడపలో ఉక్కు పరిశ్రమ రావడం బాబుకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. బాబుకు ధన - భూ దాహం పట్టుకుందని అందుకే డాట్‌ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాడని ఆరోపించారు. బురదలో కూరుకు పోయిన బాబు మాకు బురద అంటించే ప్రయాత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

ఓటమి భయంతోనే చంద్రబాబు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం పక్కా గృహాలు అధికంగా మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో దాడులు చేయిస్తూ సంస్కారంలేని వాడిగా బాబు ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి - జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ను తిట్టుకుంటూ బతకడం తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీలేదని ఆరోపించారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు రాష్ట్రంలోని ఏ రంగానికి మేలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని క‌న్నా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం గురించిన వివరాలు సమర్థ‌వంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు పార్టీకి పునాదులు అని, రానున్న రోజుల్లో ఎక్కడా వెనుకడుగు వేయకుండా అనునిత్యం పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలనీ సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి రహితంగా పాలన చేస్తామని తెలిపారు.