Begin typing your search above and press return to search.

బాబు ఆరాటంలో కొత్త యాంగిల్ చెప్పిన క‌న్నా

By:  Tupaki Desk   |   31 May 2018 6:30 AM GMT
బాబు ఆరాటంలో కొత్త యాంగిల్ చెప్పిన క‌న్నా
X
సీనియ‌ర్ కాంగ్రెస్ పార్టీ నేత‌గా సుప‌రిచితుడైన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏం చేశారో అంద‌రికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో అంట‌కాగిన ఆయ‌న‌.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌కుండా ఉండిపోయిన ఆయ‌న తీరు ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియంది కాదు. తానొక్కడినే ఏం చేయ‌గ‌ల‌నంటూ విభ‌జ‌న అంశంపై త‌న తీరును స‌మ‌ర్థించుకునే ఆయ‌న‌.. ఏపీకి చెందిన నేత‌లు ఎవ‌రికి వారు అలా అనుకోవ‌టంతోనే విష‌యం విభ‌జ‌న వ‌ర‌కూ వెళ్లిన‌ట్లు చెబుతారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో త‌న రాజ‌కీయ కెరీర్ స‌మాధి కాకుండా ఉండేందుకు వీలుగా ఆయ‌న కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిపోవ‌టం తెలిసిందే. బీజేపీలో నాలుగేళ్లుగా సాగుతున్నా.. స‌రైన బ్రేక్ రాలేద‌న్న చింత‌తో ఉన్న ఆయ‌న దిగులును అర్థం చేసుకున్న బీజేపీ అధినాయ‌క‌త్వం రీసెంట్ గా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఎంపిక చేయ‌టం తెలిసిందే.

బీజేపీలో నాలుగేళ్లుగా ఉంటున్నా.. ఎప్పుడూ ఉండ‌నంత యాక్టివ్ గా క‌న్నా ఈ మ‌ధ్య‌న ఉంటున్నారు. అధ్య‌క్ష బాధ్య‌త చేతికి వ‌చ్చినంత‌నే రోజుకు క‌నీసం ఒక్క‌సారైనా మీడియాలో త‌ళుక్కుమ‌న‌కుండా ఉండ‌లేకపోతున్నారు.

తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. ఆ మాట‌కు వ‌స్తే.. క‌న్నా ఏ పొజిష‌న్లో ఉన్నా చంద్ర‌బాబును తిట్టే విష‌యంలో మాత్రం ముందుంటారు. అలాంటిది బీజేపీ తీవ్రంగా మండిప‌డుతున్న బాబుపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డేందుకు క‌న్నా ఎందుకు సందేహిస్తారు చెప్పండి.

తాజాగా బాబును ఏసుకున్న క‌న్నా.. ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని చెప్పారు. రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌లిసి పోటీ చేసేందుకు బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. ఇప్ప‌టికే ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరిన‌ట్లుగా చెప్పారు. ఈ రోజు ఉద‌యం (బుధ‌వారం) టీవీ ఛాన‌ళ్ల చ‌ర్చ‌లో పాల్గొన్నాయ‌న‌.. టీడీపీ.. కాంగ్రెస్ ల మ‌ధ్య పొత్తు కుదిరిన‌ట్లుగా చెప్పారు. రాహుల్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు నిత్యం బీజేపీ అధినాయ‌క‌త్వాన్ని చంద్ర‌బాబు అదే ప‌నిగా విమ‌ర్శిస్తున్నార‌న్నారు.

రాహుల్ కు ద‌గ్గ‌ర‌య్యేందుకే రోజూ బీజేపీని టార్గెట్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 2019 ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఇంకో పార్టీతో పొత్తు అవ‌స‌ర‌మ‌ని తాము భావించ‌టం లేద‌న్నారు. సొంతంగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధిస్తామ‌న్న న‌మ్మ‌కం త‌మ‌కుంద‌న్నారు. ఒక‌జాతీయ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు పెట్టొచ్చ‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని చెప్పారు.

రాహుల్ ను సంతృప్తి ప‌ర్చ‌టం కోసం బాబు విప‌రీతంగా త‌పిస్తున్నార‌ని.. మోడీ.. అమిత్ షాల‌పై విమ‌ర్శ‌ల‌కు ఇదే కార‌ణంగా చెప్పారు. బాబు రాహుల్ మెప్పు కోసం బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నుకుందాం. మ‌రి.. క‌న్నా బాబును విమ‌ర్శించ‌టంలో వెనుకున్న ఉద్దేశాన్ని కూడా చెప్పేస్తే బాగుంటుంది. ఎప్పుడూ ఎదుటోళ్ల గురించేనా? మీ గురించి కూడా కాస్త చెప్పుకోండి క‌న్నా!