Begin typing your search above and press return to search.

`ప్యాకేజీ`పై చంద్ర‌బాబుకు క‌న్నా కౌంట‌ర్!

By:  Tupaki Desk   |   14 May 2018 4:24 PM GMT
`ప్యాకేజీ`పై చంద్ర‌బాబుకు క‌న్నా కౌంట‌ర్!
X
నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను బీజేపీ అధిష్టానం నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌క‌ట‌నతో సోము వీర్రాజు....నిరాశ చెంద‌డం...అజ్ఞాతంలోకి వెళ్లిపోవ‌డం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా క‌న్నా ప‌దవి చేప‌ట్టిన వెంట‌నే ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని, దానికి ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డాన్ని చంద్ర‌బాబు ఆహ్వానించార‌ని క‌న్నా అన్నారు. అయితే, ప్ర‌త్యేక ప్యాకేజీ నిధుల‌ను స‌ద్వినియోగం చేయ‌డంలో, వాటికి స‌రైన లెక్క‌లు చూపించ‌డంలో ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌ని క‌న్నా మండిప‌డ్డారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌లో చంద్ర‌బాబు అవినీతికి పాల్ప‌డ్డార‌ని, అందుకే ఆయ‌న లెక్క‌లు వెల్ల‌డించ‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌ని క‌న్నా అన్నారు. సోమ‌వారం నాడు ఢిల్లీలో జ‌రిగిన బీజేపీ రాష్ట్రాధ్య‌క్షుల స‌మావేశానికి క‌న్నా హాజ‌రైన సంద‌ర్భంగా అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌న శ‌క్తివంచ‌న లేకుండా తుది శ్వాస వ‌ర‌కు బీజేపీ అభివృద్ధికి పాటుబ‌డ‌తాన‌ని క‌న్నా అన్నారు. త‌న‌పై బీజేపీ అధిష్టానం ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌న‌ని చెప్పారు. మ‌రోవైపు, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ, జ‌న‌సేన‌ల‌తో బీజేపీ జ‌త‌క‌ట్టబోతోంద‌ని వ‌స్తున్న పుకార్లను క‌న్నా ఖండించారు. ఆ వ‌దంతుల్లో ఎంతమాత్రం నిజం లేద‌ని క‌న్నా స్ప‌ష్టం చేశారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌న్న అంశాన్ని బీజేపీ హైక‌మాండ్ నిర్ణ‌యిస్తుంద‌ని అన్నారు. అయితే, కన్నా చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ....2019లో దాదాపుగా బీజేపీ-వైసీపీ-జ‌న‌సేన లు మిత్ర‌ప‌క్షాలుగా ఉండ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏపీలో ఉన్న ప్ర‌ధాన పార్టీల‌లో....టీడీపీతో బీజేపీ తెగ‌దెంపులు చేసుకుంద‌ని....ఇక కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మైన నేప‌థ్యంలో బీజేపీ-వైసీపీ-జ‌న‌సేన ల పొత్తు ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.