Begin typing your search above and press return to search.

జగన్... బాబులా స్టిక్కర్ సీఎం కావొద్దు...!

By:  Tupaki Desk   |   26 Sept 2019 3:33 PM IST
జగన్... బాబులా స్టిక్కర్ సీఎం కావొద్దు...!
X
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోస్తున్న రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 12,500 (కేంద్రం ఇచ్చే రూ. 6,000తో కలిపి) సాయం చేయనుంది. ఈ సాయాన్ని అక్టోబర్ 15న రైతులకు అందజేయనుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక పథకానికి వైఎస్సార్ రైతు భరోసా అని ఏపీ ప్రభుత్వం నామకరణం కూడా చేసింది.

ఇక దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్పందిస్తూ...జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతు భరోసాకు మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ కన్నా ట్వీట్ చేశారు. జగన్ మీరు మరో స్టిక్కర్ సీఎం కాకండని చెప్పి.... మ్యానిఫెస్టోలో మీరు రైతులకు రూ.12500 ఇస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. కానీ నేడు మోదీ రైతులకు ఇచ్చే రూ.6000 లను కలుపుకుని 'వైఎస్సార్‌ రైతు భరోసా'గా కేంద్రం రైతులకు ఇచ్చేదానిపై బాబు లాగా మీరు స్టిక్కర్ వేయడం తప్పు అని ట్వీట్ లో పేర్కొన్నారు. రైతు భరోసాకు మోదీ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వం...కేంద్రం నుంచి వచ్చిన పథకాలని తమ పథకాలుగా పేరు మార్చి ప్రచారం చేసుకున్నారని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చే రూ. 6వేలు కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తుంది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర పథకాన్ని మీ పథకంలో కలుపుకున్నారు కాబట్టి...దానికి మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.