Begin typing your search above and press return to search.

కడప ఉక్కుతో బాబు నాటకాలు: కన్నా

By:  Tupaki Desk   |   29 Jun 2018 4:48 PM IST
కడప ఉక్కుతో బాబు నాటకాలు: కన్నా
X

ఏపీ సీఎం చంద్రబాబులో ఒక అపరిచితుడు ఉన్నాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో పర్యటించిన ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందుకే చంద్రబాబు ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ సెంటిమెంట్ తో గెలవడానికి వెళుతున్నారని మండిపడ్డారు. కానీ ప్రజలు అన్నీ గమనించి బాబుకు బుద్ది చెబుతారని అన్నారు.

కడప ఉక్కు పరిశ్రమ సమాచారాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రికి ఇవ్వకుండా చంద్రబాబు సీఎం రమేష్ తో దీక్ష చేయిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాడని కన్నా విరుచుకుపడ్డారు. బాబుకు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిపై రాష్ట్ర వాటా - కేంద్రం వాటా పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి, అరాచక, అసమర్ధత పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ప్రధాని మోడీ దేశంలో 150 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తున్నాడని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో అవినీతి - అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు.