Begin typing your search above and press return to search.

జనసేన-బీజేపీ కీలక నిర్ణయం - స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ

By:  Tupaki Desk   |   28 Jan 2020 10:21 PM IST
జనసేన-బీజేపీ కీలక నిర్ణయం - స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ
X
ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ - జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం సంయుక్తంగా ప్రకటన చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ - బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

మండలి రద్దు నిర్ణయాన్ని ఇరు పార్టీల నేతలు ఖండించారు. రాజధానిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు. రాజధాని రైతులతో మాట్లాడాలని నిర్ణయించారు. రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అదే విధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు.

ఇందుకు క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇరు పార్టీల ఆమోదంతో కమిటీ సభ్యుల ఎంపిక ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, పని చేయని వారిని పక్కన పెట్టాలని నిర్ణయించారు.

రాజధాని మార్పుపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని అధికార పార్టీ చెప్పడాన్ని ఖండించారు. అవాస్తవాలు ప్రచారం నాడు టీడీపీ, నేడు వైసీపీలు ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. అమరావతి ప్రస్తుత దుస్థితికి టీడీపీ - వైసీపీ కారణమని ఆరోపించారు. అలాగే, రాజధాని తరలింపుకు తాత్కాలికంగా బ్రేక్ పడిన నేపథ్యంలో ఇరుపార్టీలు తలపెట్టిన లాంగ్ మార్చ్‌ను రద్దు చేశారు. తమ పొత్తుకు కారణాలను ప్రజలకు వివరించాలని కూడా నిర్ణయించారు.