Begin typing your search above and press return to search.

జోలెప‌ట్టి భిక్షాట‌న చేస్తోన్న క‌న్నా

By:  Tupaki Desk   |   7 Oct 2019 8:08 AM GMT
జోలెప‌ట్టి భిక్షాట‌న చేస్తోన్న క‌న్నా
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్లో అధికార వైసీపీని ఆరు నెల‌ల పాటు టార్గెట్ చేయ‌మ‌ని... ఆ పార్టి పాల‌న ఎలా ఉందో ? చూసేందుకు ఆరు నెల‌ల టైం ఇస్తామ‌ని ముందు నుంచి చెప్పిన బీజేపీ ఇప్పుడు నాలుగు నెల‌ల‌కే వైసీపీని ఓ రేంజ్‌లో టార్గెట్‌గా చేసుకుంటోంది. బీజేపీ నేత‌లు త‌మ విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెంచుతూ జ‌గ‌న్ పాల‌న కంటే చంద్రబాబే బెట‌ర్ అని విమ‌ర్శిస్తున్నారు. ఇదంతా వాళ్ల స్ట్రాట‌జీలో భాగం అన్న‌ది తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఏపీ బీజేపీ వినూత్న నిర‌స‌న‌కు దిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు జోలెప‌ట్టి మ‌రీ భిక్షాట‌న చేస్తూ వైసీపీ ప్ర‌భుత్వంపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆరోపిస్తూ ఏపీ బీజేపీ సోమ‌వారం ఉద‌యం గుంటూరు రోడ్ల‌పై నిర‌స‌న‌కు దిగింది. ఈ క్ర‌మంలోనే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గుంటూరులో ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై ఆయన జోలెపట్టి, భిక్షాటన చేశారు.

ఇసుక విధానాన్ని నిరసిస్తూ, బీజేపీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరుగగా, స్థానిక పట్నం బజారులో కన్నా పాల్గొన్నారు. భవన కార్మికులను ఆదుకునేందుకు ఎవ‌రికి వారు త‌మ‌కు తోచినంత సాయం చేయాల‌ని ఆయ‌న భిక్షాట‌న చేస్తూ ముందుకు సాగారు. జగన్ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తెచ్చినా, ఎక్కడా, ఇసుక అందుబాటులో లేదని ఈ సందర్భంగా కన్నా ఆరోపించారు.

ప్ర‌భుత్వ ఆనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల ఎక్క‌డి క‌క్క‌డ వేలాది నిర్మాణాలు ఆగిపోయాయ‌ని... కార్మికుల‌కు ప‌నులు లేక‌పోవ‌డంతో ప‌స్తులు ఉంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేవ‌లం జ‌గ‌న్ విధానాల వ‌ల్లే వీరంతా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లయిందని ఆయన అన్నారు. ఇక ఉపాధి లేక కుటుంబం గ‌డ‌వ‌క ఇబ్బందులు ప‌డుతోన్న కార్మికుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నెల‌కు రు.10 వేలు ఇవ్వాల‌ని క‌న్నా డిమాండ్ చేశారు.