Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కోడలి మరణంపై షాకింగ్ వాదన!

By:  Tupaki Desk   |   25 July 2020 4:00 AM GMT
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా కోడలి మరణంపై  షాకింగ్ వాదన!
X
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక అనుమానాస్పద మరణం ఇప్పుడో కొత్త మలుపు తిరిగింది. స్నేహితుల ఇంటికి పార్టీకి వెళ్లినట్లుగా ప్రచారం సాగటం.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ కేసును అనుమానాస్పద మరణంగా పేర్కొంటూ సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విచారణ సాగుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా సుహారిక భర్త.. కన్నా కుమారుడు ఫణీంద్ర చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. తన భార్య మరణంపై ఆయన పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ నుఆయన కలిశారు. ఈ కేసుపై తనకున్న అనుమానాల్ని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తిస్థాయిలో జరపాలని కోరారు.

ఇక.. తన భార్య మరణంపై కన్నా కుమారుడి సందేహాల్ని చూస్తే.. తొలుత తన భార్య సీబీఐటీ వద్ద మరణించినట్లుగా తనకు చెప్పారని.. తర్వాత ఏఐజీ ఆసుపత్రికి సమీపంలోని బ్యాంబో హిల్స్ వద్ద చనిపోయినట్లు చెప్పారన్నారు. తన భార్య ఒక మారథాన్ రన్నర్ అని.. ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నారు.

కన్నా కోడలు మే 28న అనుమానాస్పద రీతిలో మరణించటం తెలిసిందే. తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె అక్కడికక్కడే కుప్పకూలారని.. ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్లుగా చెప్పారు. రాయదుర్గంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లుగా చెప్పటం తెలిసిందే. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేస్తున్న పోలీసులకు.. ఇన్నాళ్లకు కన్నా కుమారుడు తెర మీదకు రావటం.. కొత్త ఆరోపణల్ని సంధించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

సుహారిక మరణించిన రోజున ఏదో డ్రగ్ పార్టీ జరిగినట్లుగా ప్రచారం చేయటాన్ని ఫణీంద్ర గుర్తు చేస్తున్నారు. తమ కుటుంబంలో తమకు తమ తోడల్లుడికి మధ్య ఆర్థిక సమస్యలు ఉన్నట్లు చెప్పారు. వీటి గురించి సెటిల్ చేసుకునేందుకే సుహారికను అక్కడకు పిలిపించినట్లుగా చెప్పారు. తన భార్య చనిపోయిన రోజున తమ అత్తమామల్ని ఈ విషయం గురించి అడిగితే.. నీకు అవసరమా? అని తనకు సమాధానం ఇచ్చారన్నారు. ఆ రోజు పార్టీకి హాజరైన నలుగురు కూడా తప్పించుకు తిరుగుతున్నారని.. అసలు నిజాలు బయటకు రావట్లేదని ఆరోపించారు. మరీ.. వ్యవహారంపై పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.