Begin typing your search above and press return to search.

బాలకృష్ణ ఇంట్లో కాల్పుల విషయం ఎత్తిన ఏపీ మంత్రి!

By:  Tupaki Desk   |   15 April 2021 4:30 AM GMT
బాలకృష్ణ ఇంట్లో కాల్పుల విషయం ఎత్తిన ఏపీ మంత్రి!
X
జగన్ కేనా లూప్ హోల్స్ ఉండేది.. చంద్రబాబు, నారా లోకేష్ కు ఉండవా? అవి ఎందుకు టార్గెట్ కావు.. అందుకే వైసీపీ మంత్రులు ఇప్పుడు టీడీపీ చరిత్రను తవ్వేస్తున్నారు. చంద్రబాబు గతంలో చేసిన ఘనకార్యాలను మళ్లీ వెలికితీస్తున్నారు. వైఎస్ వివేక హత్యను రాజకీయం చేస్తున్న నారా లోకేష్ కు ఆయన మామ హైదరాబాద్ లోని తన ఇంట్లో చేసిన తుపాకీ కాల్పుల విషయాన్ని లేవనెత్తారు. ఎన్టీఆర్ నుంచి లోకేష్ దాకా చరిత్రలను తవ్వేందుకు వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే నారాలోకేష్ మామ, స్టార్ హీరో అయిన బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనను తాజాగా వైసీపీ తెరపైకి తేవడం విశేషం.

తిరుపతి ఉపఎన్నికల్లో వైఎస్ వివేకా ఇష్యూను టీడీపీ లేవనెత్తుతోంది. తిరుపతి జిల్లాకు సంబంధం లేని కడప జిల్లాకు చెందిన సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్యను టీడీపీ ఎలుగెత్తి చాటుతోంది. రాజకీయం చేస్తోంది. రచ్చ రచ్చ చేస్తోంది. అసలు సంబంధం లేని ఈ విషయాన్ని తీసి జగన్ సర్కార్ ను అభాసుపాలు చేస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న అలిపిరిలో ప్రమాణం చేశారు. తన లాగే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వచ్చి అలిపిరి వద్ద ప్రతిజ్ఞ చేయమని కోరిన విషయం తెలిసిందే. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా జగన్ ను సైతం ఈ ప్రమాణం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

అయితే నారా లోకేష్ కు తాజాగా ఏపీ వ్యవసాయ మంత్రి కురసల కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. "మీ తండ్రి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని తీసుకోలేదని మీరు ప్రతిజ్ఞ చేయాలి. మీ మామయ్య బాలకృష్ణ తన ఇంట్లో బహిరంగంగా కాల్పులు జరుపలేదని ప్రతిజ్ఞ చేయాలి. గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన 29 మరణాలకు మీ తండ్రి బాధ్యత వహించరని మీరు వాగ్దానం చేయాలి. మీ తండ్రి తన తమ్ముడు రామామూర్తిని అరెస్ట్ చేయించలేదని ప్రతిజ్ఞ చేయాలి. ఈ నిజాలపై లోకేష్, చంద్రబాబులు కలిసి ప్రతిజ్ఞలన్నీ చేయాలి " అని కన్నబాబు డిమాండ్ చేశారు..

వైఎస్ వివేకానందారెడ్డి కేసు ఇప్పుడు సీబీఐ వద్ద ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏమైనా చేయగలదా అని కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యకు జగన్ కారణమన్న లోకేష్ కు అసలు బుద్ది ఉందా? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇందులో ఏమైనా చేయి చేయగలదా? అని కౌంటర్ ఇచ్చాడు. లోకేష్ డ్రామా కంపెనీ వ్యక్తిలాంటివాడు. అతని తండ్రిపై ఎవరో రాళ్ళు రువ్వారని పేర్కొంటూ ఒక నాటకం పోషిస్తాడని ఆరోపించారు. మరుసటి రోజు లోకేశ్ వచ్చి సిబిఐ చేతిలో ఉన్న కేసు గురించి ప్రతిజ్ఞ చేయడం గురించి అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నాడని కన్నబాబు ఆరోపించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో జరిగిన ఏదైనా విచారణకు సీబీఐని అనుమతించనని చెప్పారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐని రాష్ట్రంలో అనుమతించారు. ఏదైనా సమస్యపై దర్యాప్తు చేయడానికి అవకాశం ఇచ్చారు.ఇదే చంద్రబాబు, జగన్ కు మధ్యనున్న వ్యత్యాసం. అంతర్వేది రథం దహనం కేసు కూడా సీబీఐకి ఇచ్చామని.. ఇది వైయస్ జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు నిదర్శనం అని కన్నబాబు చెప్పుకొచ్చారు.