Begin typing your search above and press return to search.

కంగనా ఆఫీసు కూల్చివేత...ఖండించిన మహారాష్ట్ర గవర్నర్

By:  Tupaki Desk   |   10 Sept 2020 4:00 PM IST
కంగనా ఆఫీసు కూల్చివేత...ఖండించిన మహారాష్ట్ర గవర్నర్
X
సుశాంత్ సూసైడ్ కేసు వ్యవహారం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్, పోలీసులకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కంగనాకు బీజేపీ మద్దతుండంటూ ప్రచారం జరుగుతుండగా...కంగన వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ముంబైలోని కంగనా ఆఫీసును బృహణ్ ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఉద్ధవ్ సర్కార్ తీరును తప్పుబట్టిన కోషియారీ.... కంగన ఆఫీసు కూల్చివేత తదితర పరిణామాలపై కేంద్రానికి నివేదిక సమర్పించాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ ఘటనను ఖండించారు.

తన ఆఫీస్ కూల్చివేసిన తర్వాత కూడా ఉద్ధవ్ సర్కార్ పై కంగనా మాటలదాడి కొనసాగించింది.సినీ మాఫియాతో జతకట్టి తన ఇల్లు కూల్చి ప్రతీకారం తీర్చుకున్నారని, ఏదో ఒకరోజు మీ అహంకారం కూడా కూలిపోతుందని ఉద్ధవ్ ను ఉద్దేశించి కంగనా పరోక్షంగా ట్వీట్ చేసింది. కశ్మీరు నుంచి పండిట్లను తరిమివేసినప్పుడు వారు పడిన బాధ తనకు అర్థమైందని, అయోధ్యతోపాటు కశ్మీరుపై కూడా సినిమా తీస్తానని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై రహదారులు అధ్వాన్నంగా ఉన్నా సర్కార్ కు పట్టలేదని, ఓ నటి ఇల్లు కూల్చడంపై శ్రద్ధ పెట్టారని విమర్శించింది. తాను అన్నట్లుగానే ముంబై ఇప్పుడు పీవోకే అయిందని, ప్రజాస్వామ్యం మరణించిందని ట్వీట్ చేసింది.