Begin typing your search above and press return to search.

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుంది: వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   6 Nov 2020 10:50 AM GMT
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుంది: వైసీపీ ఎమ్మెల్యే
X
వైసీపీ ఎమ్మెల్యే బయటపడ్డాడు. తన ఆవేదన అంతా మీడియా, ప్రజల ముఖంగా వెళ్లగక్కాడు. తనలో గూడుకట్టుకొని రగిలిపోతున్న అగ్ని పర్వతాన్ని బద్దలు కొట్టాడు. ఫలితంగా వైసీపీ ప్రభుత్వంలోనే వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తాజాగా జిల్లాలోని ప్రభుత్వ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ యంత్రాంగం తీరు చూస్తుంటే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా ఉందని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కందకూరు రైతులకు ఈ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూసి తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన వివరించారు. విషయం తెలిశాక అధికారులు వ్యవహరించిన తీరు చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని తాను మథన పడ్డానన్నారు. కానీ అధికారుల్లో కించిత్‌ అపరాధ భావన కూడా కనిపించకపోవటం శోచనీయమని విమర్శించారు.

ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం పెదపవనిలో 70 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిలో కొంత భూమిని అక్రమార్కులు అమ్మేశారని ఆయన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఆరోపించారు. 2018లో ఈ భూకుంభకోణంపై తాను స్వయంగా లోకాయుక్తలో కేసు వేశానన్నారు. ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అప్పట్లో రెవెన్యూ అధికారులు లోకాయుక్తకు తప్పుడు సమాచారం ఇచ్చారని మహీధర్‌రెడ్డి ఆరోపించారు.

అయితే ఆ ప్రభుత్వ భూముల్లో ఉన్న విలువైన టేకు చెట్లను అక్రమార్కులు దర్జాగా కొట్టుకుని పోతుంటే అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్న తీరు చూస్తుంటే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారనే సామెత గుర్తుకొచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రూ.20లక్షల విలువగల టేకుని దౌర్జన్యంగా కొట్టుకుని పోతుంటే రెవెన్యూ అధికారులు చూస్తూ ఉండిపోయారని ఆయన తెలిపారు. మళ్లీ వారంరోజుల క్రితం మరో రూ.10లక్షల విలువైన టేకు చెట్లను కొడుతుండగానే స్థానికులు అటు రెవెన్యూ అధికారులకు, విలేకరులకు, ఫారెస్ట్‌ అధికారులకు కూడా సమాచారమిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఆరోపించారు. చివరికి ఫారెస్ట్‌ అధికారులు కూడా పెదపవనికి వచ్చి నరికిన టేకు చెట్లను చూసి కేసు నమోదు చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టేకు చెట్లు ప్రభుత్వానివా కాదా అనేది పక్కన బెడితే నరికేందుకు ఫారెస్ట్‌ అనుమతి తీసుకోనందునైన ఆ సరుకుని సీజ్‌ చేసి కేసు నమోదు చేయాల్సి ఉన్నా ఆ పనిచేయకుండా అన్ని శాఖల అధికారులు మెత్తగా జారుకున్నారని విమర్శించారు.

ఈ వ్యవహారంలో జిల్లా యంత్రాంగం, డివిజన్‌ యంత్రాంగం, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన మండిపడ్డారు. లోకాయుక్తలో కేసు తుది విచారణ త్వరలోనే ఉందని, తాను స్వయంగా హాజరై బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతానని ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి వివరించారు.

ఇలా సొంత పార్టీ ప్రభుత్వంలో అధికారుల తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేనే కడిగేయడం సంచలనమైంది. ఈ ఆరోపణలు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో చర్చనీయాంశమయ్యాయి.