Begin typing your search above and press return to search.

సునీత మ‌ధ్య‌వ‌ర్తిత్వం బెడిసికొట్టిందా ..!

By:  Tupaki Desk   |   24 April 2016 6:07 AM GMT
సునీత మ‌ధ్య‌వ‌ర్తిత్వం బెడిసికొట్టిందా ..!
X
ఆపరేష‌న్ ఆక‌ర్ష్ ఫలిస్తోంది. వాళ్ల వ్య‌క్తిగ‌త కార‌ణాలే కావొచ్చు.. ఏదైనా ఆశించి పార్టీలో చేరుతుండొచ్చు.. కార‌ణ‌మేదయినా టీడీపీలో చేరుతున్న వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వైకాపా నుంచి టీడీపీలో నిన్న‌టికి నిన్న అనంత‌పురం జిల్లా క‌దిరి ఎమ్మెల్యే చాంద్ బాషా చేరితే సోమ‌వారం క‌ర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మ‌ల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి చేరుతున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. పార్టీలోకి వ‌చ్చే నేత‌లు కొంద‌రు వ‌స్తూ వ‌స్తూ కొన్ని స‌మ‌స్య‌లను కూడా వెంట‌తీసుకొస్తున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరుగుతుంద‌ని.. అంద‌రికీ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇందులో కొత్త‌వారికి అవ‌కాశ‌మిస్తే.. త‌మ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని సీనియ‌ర్ నాయ‌కులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఇదే ప‌రిస్థితి ఉంది. క‌దిరి ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే చాంద్ బాషా చేరిక‌తో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట‌ప్ర‌సాద్ అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌. మంత్రి సునీత న‌చ్చ‌జెప్పినా ఆయ‌న విన‌లేద‌ట‌.

అనంతపురం జిల్లా కదిరి వైకాపా ఎమ్మెల్యే తాజాగా సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. ఆయ‌న పూర్వాశ్ర‌మంలో టీడీపీకి చెందిన వారే. ఆయ‌న తిరిగి టీడీపీలోకి రావ‌డంతో అక్కడ టీడీపీ ఇన్‌ చార్జ్‌ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాంద్ బాషాకు టిక్కెట్ ఇస్తామ‌న్న హామీ మేరకే ఆయ‌న పార్టీలో చేరార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఇంతకాలం అక్క‌డ ఇన్‌ చార్జిగా ఉన్న ప్రసాద్ కు అసంతృప్తికి గుర‌య్యార‌ట‌.

త‌న‌కు సీటు ద‌క్కుతుంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాన‌ని.. ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని జిల్లా టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వెంట‌నే విష‌యం తెలుసుకున్న మంత్రి సునీత‌.. ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించార‌ట‌. ఎంత‌కి విన‌క‌పోయేస‌రికి.. సీఎం చంద్ర‌బాబు వద్ద‌కు కూడా తీసుకెళ్లారట‌. కానీ ప్ర‌సాద్ అక్కడ కూడా ఆయన తన అసమ్మతి తెలిపారట. అంతేకాక చాంద్ బాషా చేరిక ప్రక్రియ పూర్తి కాకుండా అక్కడ నుంచి వెళ్లిపోయార‌ని స‌మాచారం. అక్క‌డ కూడా సునీత మ‌ధ్య‌వ‌ర్తిత్వం బెడిసికొట్టిందంటున్నారు.