Begin typing your search above and press return to search.

తెదేపా ఎంపీపై ఎట్రాసిటీ కేసు!

By:  Tupaki Desk   |   20 Sep 2017 4:24 AM GMT
తెదేపా ఎంపీపై ఎట్రాసిటీ కేసు!
X
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ టీజీ వెంకటేష్ పై ఎస్సీ ఎట్రాసిటీ, బెదిరింపుల కేసు నమోదు కానుంది. రచయిత, ఉద్యమకారుడు అయిన కంచ ఐలయ్య టీజీ వెంకటేష్ మీద కేసు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం రాసినందుకు ఐలయ్యను నడిరోడ్డు మీద ఉరితీయాలని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ ఇలా బహిరంగ బెదిరింపులకు పాల్పడడం వల్ల.. తన ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నదని ఐలయ్య అంటున్నారు. టీజీ వెంకటేష్ మీద ఈ మేరకు కేసు పెట్టబోతున్నట్లుగా ఐలయ్ చెబుతున్నారు.

అయితే చిత్రమైన సంగతి ఏంటంటే.. వ్యవహారం మొత్తం ఐలయ్యకు- వైశ్యలకు సంబంధించిన వివాదం. వైశ్యుల గురించి ఐలయ్య అభ్యంతరకరమైన స్థాయిలో తీవ్రమైన కామెంట్లతో ఏకంగా పుస్తకాన్నే ప్రచురించారు. సాధారణంగా ఇలాంటి కామెంట్లు ఫేస్ బుక్ లో చిన్నవిగా వచ్చినా కూడా పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తాయి. అలాంటిది ఆయన పెద్ద పుస్తకమే రాసేశారు. ఇది సహజంగానే పెద్ద ప్రకంపనాల్ని సృష్టించింది. వైశ్యులంతా ఐలయ్య మీద విరుచుకుపడుతున్నారు. టీజీ వెంకటేష్ కూడా ఆ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే గనుక.. అదే తరహాలో స్పందించారు. వివాదం ఒక వ్యక్తికి – ఒక కులానికి మధ్య నడుస్తోంటే ఐలయ్య ఇందులోకి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా లాగుతున్నారు.

తన పార్టీకి చెందిన ఎంపీ చేసిన ఇలాంటి బెదిరింపు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించాలని ఐలయ్య డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోతే గనుక.. టీజీ వెంకటేష్ ను చంద్రబాబు సమర్థిస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. అదే మాదిరిగా.. టీజీకి- కేసీఆర్ తో కూడా ముడిపెడుతున్నారు. కేసీఆర్ అండతోనే హైదరాబాదులో టీజీ అనేక వ్యాపారాలు చేయగలుగుతున్నారని అంటూనే.. తనను చంపించడానికి కేసీఆర్- టీజీ వెంకటేష్ ల మధ్య ఒక ఒప్పందం ఉన్నదని కూడా ఐలయ్య చెబుతుండడం విశేషం.