Begin typing your search above and press return to search.

మీరు కూడా అదే ప‌ని చేస్తున్నారా ఐల‌య్య‌?

By:  Tupaki Desk   |   16 Sep 2017 5:10 AM GMT
మీరు కూడా అదే ప‌ని చేస్తున్నారా ఐల‌య్య‌?
X
బుర‌ద జ‌ల్ల‌టానికి మించిన తేలికైన ప‌ని మ‌రేదీ ఉండ‌దు. మేధావి వ‌ర్గానికి చెందిన వారు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. అవేమీ ప‌ట్టించుకోకుండా త‌న మేధోత‌నం స‌మాజంలో మ‌రిన్ని ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసేలా వ్య‌వ‌హ‌రించ‌టం కంచె ఐల‌య్య లాంటి వారికి మాత్ర‌మే సాధ్యం. కులాల గురించి భ‌విష్య‌త్ త‌రాలు తెలుసుకోవ‌టం కోసమే తాను పుస్త‌కాలు రాస్తున్న‌ట్లు చెబుతున్నారు.

భ‌విష్య‌త్ త‌రాల‌కు స‌మాచారం అందించ‌ట‌మే లక్ష్య‌మైతే.. వారి మ‌న‌సులు గాయ‌ప‌ర్చేలా.. వారి మ‌నోభావాలు దెబ్బ తినేలా ఎందుకు పుస్త‌కాలు రాస్తున్నార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌టం లేదు. ప్ర‌తి ఒక్క కులంలోనూ మంచి.. చెడు రెండు ఉంటాయి. మంచిని వ‌దిలేసి.. చెడును మాత్ర‌మే ఫోక‌స్ చేసే ఆయ‌న పుణ్య‌మా అని కులాల మ‌ధ్య మ‌రిన్ని కుమ్ములాట‌లే త‌ప్పించి మ‌రింకేమీ జ‌ర‌గ‌టం లేదు.

కోమ‌టోళ్లు స్మ‌గ్ల‌ర్లు అంటూ చిత్ర‌విచిత్ర‌మైన వాద‌న‌లు వినిపించ‌ట‌మే కాదు.. ఆ వ‌ర్గాన్ని దారుణ‌మైన రీతిలో ఆరోప‌ణ‌లు చేయ‌టం ఐల‌య్య‌కు మాత్ర‌మే చెల్లింది. సామాజికంగా ద‌ళితులైన బ్రాహ్మ‌ణులు.. వైశ్యుల్ని టార్గెట్ చేసే ఆయ‌న‌.. అన్ని కులాల మీద పుస్త‌కాలు రాసేయ‌గ‌ల‌రా? అన్న సందేహానికి స‌మాధానం చెప్ప‌టం క‌నిపించ‌దు.

త‌మ మానాన తాము అన్న‌ట్లు బ‌తికేసే వైశ్యుల్ని చుల‌క‌న చేసేలా కోమ‌ట్లు అంటూ పుస్త‌క టైటిల్‌ ను పెట్టేసి.. త‌ను క‌క్కాల్సిన విషాన్ని క‌క్కేసిన ఐల‌య్య‌.. ఆ వ‌ర్గం త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తే మాత్రం త‌ట్టుకోలేక‌పోవ‌టం ఐల‌య్య‌లో క‌నిపిస్తుంది. అంతేనా.. వైశ్యుల వ‌ల్ల త‌న‌కు ప్రాణ‌హాని ఉన్న‌ట్లుగా ఆయ‌న ఆరోపించ‌టం మ‌రింత చిత్రంగా ఉంటుంది. సామాజికంగా వైశ్యులు ఎలా ఉంటారు? వారు హ‌త్య‌లు చేసేంత ప‌రిస్థితుల్లో ఉంటారా? ఐల‌య్య లాంటి మేధావి ప్రాణాలు తీయ‌టం త‌ర్వాత‌.. ఆయ‌న‌కు భ‌యాన్ని క‌లిగించే స్థాయిలో ఉన్నారా? అన్న ప్ర‌శ్న‌లు వేసుకుంటే అస‌లు విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

దేశ సంప‌ద‌లో 46 శాతం ఆర్య‌వైశ్యుల గుప్పెట్లోనే ఉంద‌ని.. వారు పార్టీల‌కు ఇచ్చే విరాళాల్లో 5 శాతం సొమ్మును ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు విరాళంగా ఇస్తే దేశం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. ఆర్య‌వైశ్యుల వ‌ద్ద డ‌బ్బులు తీసుకొని త‌న‌పై కొంద‌రు బీజేపీ.. టీఆర్ ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న‌ట్లుగా ఆరోపించారు. ఒక‌వేళ ఐల‌య్య మాట‌లే నిజ‌మ‌ని అనుకుందాం. వైశ్యుల త‌ర‌ఫున మాట్లాడిన వారంతా వారి వ‌ద్ద డ‌బ్బులు తీసుకునే చేశార‌నుకుంటే.. మ‌రి.. ఐల‌య్య త‌ర‌ఫున మాట్లాడే వారంద‌రికీ ఆయ‌న కూడా డ‌బ్బులిచ్చే విమ‌ర్శ‌లు చేయిస్తున్నారా? అన్న‌ది ప్ర‌శ్న‌. త‌న మాట‌ల‌తో.. రాత‌ల‌తో ఇప్ప‌టికే ఒక వ‌ర్గం మ‌న‌సుల్ని తీవ్రంగా గాయ‌ప‌ర్చిన ఐల‌య్య‌.. ఇప్ప‌టికి త‌న మొండిత‌నాన్ని.. పిడివాద‌న‌ను వినిపించ‌టం కాస్తంత చిత్ర‌మైన విష‌యంగానే చెప్పాలి.

ఐల‌య్య వాద‌న‌నే ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే.. దేశంలోని ధ‌నికులైన ద‌ళితులంతా త‌మ జాతిని వృద్ధిలోకి తీసుకురావ‌టానికి వీలుగా త‌మ సంపాద‌న‌లో 25 శాతాన్ని పేద ద‌ళితుల‌కు విధిగా ఇవ్వాల‌న్న పిలుపునిచ్చే ధైర్యం ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఇలాంటి ప్ర‌శ్న‌లు తెర మీద‌కు వ‌చ్చేలా చేస్తున్న ఐల‌య్య‌.. ఇందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్య‌త ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.