Begin typing your search above and press return to search.

ఐలయ్య కథ ‘కంచ’కు..!

By:  Tupaki Desk   |   29 Oct 2017 5:39 AM GMT
ఐలయ్య కథ ‘కంచ’కు..!
X
రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కంచ ఐల‌య్య ర‌చించిన పుస్త‌కం ‘ సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమటోళ్ళు` పుస్తకంతో మొద‌లైన ర‌చ్చ ఎపిసోడ్‌ కు ఫుల్‌ స్టాప్ పడింది. గత కొంతకాలంగా విజయవాడలో జరుగుతున్న వివాదానికి తెరపడింది. రెండు వర్గాలు చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపాయి. ఐలయ్య అనుకూల వర్గం - వ్యతిరేక వర్గాలు తలపెట్టిన పోటాపోటీ సభలు శనివారం కార్యరూపం దాల్చలేదు. ఐలయ్యకు సన్మానం పేరుతో సామాజిక వర్గాల జేఎసి విజయవాడ గాంధీనగర్‌ లోని జింఖానా గ్రౌండ్సు వేదికగా సభ జరుపుతామని ప్రకటించింది. దీంతో ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆర్యవైశ్య - బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక ఆత్మీయ సదస్సును అక్కడే నిర్వహిస్తామని ముందుకు వచ్చాయి. దీంతో సామాజిక వర్గాల నడుమ తలెత్తిన వివాదం క్రమేణా రాజుకుంటున్న తరుణంలో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం రెండు వర్గాలతో తొలుత సమావేశం ఏర్పాటు చేసి శాంతి భద్రతల అంశంగా పరిగణించాలని సూచించాయి. అయినా తాము వినేది లేదనే వైఖరి కనపర్చడంతో సీరియస్‌ గా తీసుకున్న పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ సభలకు అనుమతి నిరాకరించారు.

ఇరు వ‌ర్గాల సభలకు అనుమతి లేనందున నిర్వహిస్తే అరెస్టులు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపధ్యంలో శనివారం ఏపీలోని 13జిల్లాల నుంచి - అదేవిధంగా తెలంగాణాలోని హైదరాబాద్ నుంచి రెండు వర్గాలు తరలివస్తాయని భావించి భారీ పోలీసు బలగాలు నగరమంతా మోహరించాయి. జింఖానా మైదానాన్ని అదుపులోకి తీసుకుని ఇటువైపు మార్గాలు మూసివేశారు. నగరంలోని ముఖ్య కూడళ్ళల్లో ప్రత్యేక బలగాలు తిష్ట వేశాయి. అయితే కర్నూలు - ఇతర జిల్లాల నుంచి నగరానికి చేరుకున్న పలువురు నగరంలో ఆందోళనకు దిగే ప్రయత్నం చేయగా 21మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌ కు తరలించారు. ఈక్రమంలో రెండు వర్గాలు సంప్రదింపులు జరుపుకుని ఓ నిర్ణయానికి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరస్పర భేటీల ద్వారా చర్చలు జరపాలని తీర్మానించాయి. దీనికి నాందిగా నగరంలోని అంబేద్కర్ - మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అయితే నగరంలో 144సెక్షన్ అమల్లో ఉన్నందున వీరిని పోలీసు లు అడ్డుకున్నారు. అనంతరం ఐలయ్య అనుకూల - వ్యతిరేక రెండు వర్గాలకు సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ - ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు - ఏపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కరరావు - సామాజిక హక్కుల వేదిక ప్రతినిధి పోతుల సురేష్ - సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ - డిహెచ్‌ పిఎస్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బుట్టి రాయప్ప తదితర బృందం శనివారం రాత్రి నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చి సీపి గౌతం సవాంగ్‌ తో భేటీ అయ్యారు. సామరస్యంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని తీర్మానించినట్లు సీపి వద్ద ఒప్పుకున్న మీదట బయటకు వచ్చి తమ అంగీకార ప్రకటన చేశారు.

ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు - సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్‌ లో ఉన్న ఐలయ్యతో కూడా ఫోన్‌ లో చర్చించామని, ఇక జరగబోయే మీటింగుల్లో వైశ్యకులం గూర్చి మాట్లాడనని చెప్పారని - పుస్తకంలోని అంశాలపై చర్చించడానికి సిద్ధమని చెప్పారన్నారు. నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌ లో తొలి భేటీ అనంతరం తెలుగురాష్ట్రాల్లో చర్చలు జరుపుకునేలా తీర్మానించామన్నారు.

కాగా, రచయిత ఐలయ్య పుస్తకంపై ఇరు వర్గాలు కూర్చొని చర్చించుకునేలా అంగీకారానికి రావ డం శుభపరిణామమని విజయవాడ పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ అన్నారు. రెండువర్గాలతో భేటీ అనంతరం సీపి మీడియాతో మాట్లాడుతూ సమాజంలోని కుల - మత వర్గాల మధ్య చిచ్చు రేపే దిశగా కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం ప్రయత్నాలు చేసి ఉండవచ్చుగాని, ప్రధాన సామాజిక వర్గాలు - సంఘాల ప్రతినిధులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆరోగ్యకరమని అభినందించారు. చిచ్చు రేపేందుకు ఇంకా కొన్ని గ్రూపులపై తాము చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమన్నారు. ఈపరిణామాలను ఆర్యవైశ్య - బ్రాహ్మణ సంఘంలో చీలిక ఏర్పడి రెండు వర్గాలు కావడం కొసమెరుపు.