Begin typing your search above and press return to search.

కంచ ఐలయ్య భయపడ్డాడా?

By:  Tupaki Desk   |   4 Nov 2017 4:28 AM GMT
కంచ ఐలయ్య భయపడ్డాడా?
X
వివాదాస్పద పుస్తక రచయిత, రేగిన వివాదం నుంచి పుస్తకానికి మరింత మైలేజీ వచ్చే వరకు వివాదాన్ని పెంచుకోవడానికే తప్ప, తుంచుకోవడానికి సుముఖత చూపించని రచయిత కంచచ ఐలయ్య తాజా పరిణామాలపై ఆందోళన చెందుతున్నారా? బహిరంగ సవాళ్ల విషయంలో చాలా దీటుగా, మొండిగా స్పందించిన ఆయన ఇప్పుడు కాస్త మెత్తబడుతున్నారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. తను ఇరుకున పడే పరిస్థితి ఉన్నదని అర్థం కావడంతో ఆయన ఒక మెట్టు దిగి.. తన మీద దాఖలైన కేసులను కొట్టివేయాల్సిందిగా న్యాయస్థానాన్ని అర్థిస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.

కంచ ఐలయ్య ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం రాసినప్పటినుంచి వివాదం రేగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిమీద వైశ్య కులస్థులంతా చాలా సీరియస్ అవుతున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా ఆయన మీద విరుచుకుపడుతున్నారు. అయితే ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. తమ కులాన్ని దూషించినందుకు వారు ఐలయ్య మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే.. అది కాస్తా దళిత కులానికి వ్యతిరేకంగా చేస్తున్న సంగతి లాగా ఒక ప్రచారం కూడా మొదలైంది. మధ్యలో వామపక్ష నేతలు కూడా ఎంట్రీ ఇచ్చి ఐలయ్యకు అండగా నిలబడ్డారు.

తర్వాతి పరిణామాల్లో ఇద్దరూ పోటాపోటీ చర్చా సభలకు పిలుపు ఇవ్వడం ... పోలీసుల అనుమతి నిరాకరణ అవి ఆగిపోవడం జరిగింది. అయితే ఐలయ్య మినహా ఆయనకు మద్దతిచ్చిన మిగిలిన మేధావులు- వైశ్యవర్గం మధ్య ఓ ఒప్పందం జరిగింది. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను తీసేస్తాం అని ఐలయ్య తరఫున వారు హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. వాటిని ఐలయ్య తనకు సంబంధం లేదని ఖండించారు.

ఆ తర్వాత.. ఐలయ్య మీద న్యాయస్థానంలో కేసులు నమోదయ్యాయి. ఇక్కడమాత్రం ఆయన మెత్తబడక తప్పినట్లు లేదు. ఇన్నాళ్లూ తన భావప్రకటనా స్వేచ్ఛ గురించి, దాన్ని హరిస్తున్నారంటూ ఎడాపెడా మాట్లాడిన ఐలయ్య, ఇప్పుడు అదే మాట చెబుతున్నా.. తాను ఎవరినీ నొప్పించలేదని, స్మగ్లర్లు అంటే డిక్షనరీ మీనింగ్ రాశానే తప్ప.. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాను రాసిన దానిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వివాదం రేగిందని కోర్టుకు నివేదిస్తున్నారు. మొత్తానికి కోర్టుల్లో విచారణ సాగితే.. వివాదం మరింత పీటముడి బిగుస్తుందన్న అనుమానం ఆయనకు కలిగినట్లుంది. ఆ భయంతోనే ఆయన కొంత మెత్తబడి.. ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు.